Begin typing your search above and press return to search.

ఆమె తీరు కేటీఆర్ ను భయపెట్టిందట

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:55 AM GMT
ఆమె తీరు కేటీఆర్ ను భయపెట్టిందట
X
తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ అంతకంతకూ ముదురుతోంది. తెలంగాణపై పట్టు సాధించి.. అధికారాన్ని సొంతం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం పావులు కదుపుతుంటే.. తమకున్న పట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకుండా తమ సత్తా చాటాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. తాము టార్గెట్ చేయనంతవరకు ఓకే కానీ.. ఒకసారి చేసిన తర్వాత వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించే కమలనాథులు.. ఇటీవల కాలంలో తెలంగాణలో తమ జోరును పెంచేశారు.

తరచూ తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక కార్యక్రమం మీద రావడం.. వారి చేష్టలతో తెలంగాణ ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. అలా అని టీఆర్ఎస్ ఏదో తక్కువ తిన్నదని చెప్పటం లేదు. బీజేపీ విసురుతున్న సవాళ్లకు సమాధానాలు చెబుతూనే.. తాము చేయాల్సిన పనిని చేసుకుంటూ పోతోంది గులాబీ నాయకత్వం. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో పర్యటించటం తెలిసిందే.

ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు. అంతేకాదు.. అక్కడే ఉన్న కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి రవాణా.. గోదాం ఖర్చుల్ని కేంద్రం భరిస్తోందని.. ప్రజలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్న విషయాన్ని చెబుతూ.. రేషన్ దుకాణాలపై ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టడం లేదని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను ఆమె ప్రశ్నించి.. ఫైర్ అయ్యారు.

దీనిపై తాజాగా కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. కేంద్రమంత్రి నిర్మలమ్మ తీరును తప్పుపట్టారు. కలెక్టర్ తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవర్తించిన తీరు తనను భయపెట్టిందని.. బీజేపీ నేతల ప్రవర్తనతో ఐఏఎస్ అధికారులు భయపడుతున్నారన్నారు.

ఈ ఉదంతంలో కలెక్టర్ తీరును ప్రశంసించిన మంత్రి కేటీఆర్.. ఆయనకు అండగా నిలిచారు. కష్టపడి పని చేసే ఆలిండియా సర్వీసెస్ అధికారుల్ని ఇలాంటి రాజకీయ నేతలు నిరుత్సాహానికి గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ తరహా ఉదంతాలు మరిన్ని చోటు చేసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.