Begin typing your search above and press return to search.

ఈ మాజీ సీఎం కుమారుడు బీజేపీలో చేరుతున్నారా?

By:  Tupaki Desk   |   17 Nov 2022 5:06 AM GMT
ఈ మాజీ సీఎం కుమారుడు బీజేపీలో చేరుతున్నారా?
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి గతంలో నాలుగుసార్లు హైదరాబాద్‌ నగరంలోని సనత్‌నగర్‌ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

కాగా ఆయన తాజాగా బీజేపీ నేతలతో కలసి ఢిల్లీ వెళ్లడంతో మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న అనైక్యత, తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి డిపాజిట్‌ కూడా రాకపోవడం, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించలేకపోవడం వంటి కారణాలతో మర్రి శశిధర్‌రెడ్డి పార్టీని వీడటానికి నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ వార్తలను మర్రి శశిధర్‌రెడ్డి ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని స్పష్టం చేశారు. తన మనుమడి స్కూల్‌ ఫంక్షన్‌ ఉండటంతో తాను ఢిల్లీకి వచ్చానని తెలిపారు. తాను వచ్చిన విమానంలోనే బీజేపీ నేతలు కూడా ఉన్నారని వివరించారు. అంతకు మించి ఇందులో ఎలాంటి ప్రాధాన్యత లేదని తేల్చిచెప్పారు.

కాగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మర్రి శశిధర్‌రెడ్డి మరో ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి (పీజీఆర్‌)తో కలసి హైదరాబాద్‌ బ్రదర్స్‌గా ముద్రపడ్డారు. కాంగ్రెస్‌లో నిత్య అసమ్మతివాదులుగా ఉండేవారు. దీంతో ఆ సమయంలో మర్రి శశిధర్‌రెడ్డికి మంత్రి పదవి కూడా దక్కలేదు. అయితే జాతీయ స్థాయిలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌కు వైస్‌ చైర్మన్‌గా కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదాలో మర్రి అప్పట్లో పదవి దక్కించుకున్నారు.

కాగా మర్రి శశిధర్‌రెడ్డి బంధువు చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు 2009 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ గెలవని మర్రి శశిధర్‌రెడ్డి అప్పటి నంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో చేరికలపై దృష్టి సారించిన బీజేపీ వివిధ పార్టీల నేతలపై వలేస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే మర్రి శశిధర్‌రెడ్డిపై దృష్టి సారించిందని అంటున్నారు. అందులోనూ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రూపంలో టీఆర్‌ఎస్‌కు సనత్‌నగర్‌లో గట్టి అభ్యర్థి ఉన్నారు. బీజేపీకి ఆ నియోజకవర్గంలో గట్టి అభ్యర్థి లేరు. ఈ నేపథ్యంలో మర్రిపై దృష్టి సారించిందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.