Begin typing your search above and press return to search.

పెద్దోళ్లు చేసే తప్పులు మీడియాకు కనిపించవా?

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:13 AM GMT
పెద్దోళ్లు చేసే తప్పులు మీడియాకు కనిపించవా?
X
కొన్ని తప్పుల్ని ఎప్పటికి మర్చిపోలేం. అలాంటిదే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాద ఘటనగా చెప్పాలి. బాధ్యత లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా మిట్టమధ్యాహ్నం వేళలో గంటకు 104 కి.మీ. వేగంతో ఫైఓవర్ మీద ప్రయాణం అంటే ఏమని చెప్పాలి? అలాంటి తప్పే చేసి తన కంటే.. ఈ వ్యవహారంలో ఏ మాత్రం సంబంధం లేని ఒక అమాయక మహిళ ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారు గేమింగ్ కంపెనీ సీఈవో కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు. తమ సంస్థ రూపొందించే వీడియో గేముల్లో మాదిరే.. తన కారును ఫ్లైఓవర్ మీద దూసుకెళ్లేలా చేసిన వైనంలో గాయపడిన అతడ్ని.. ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చటం.. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన వార్తలు పెద్దగా బయటకు రాలేదు.

ప్రమాదం జరిగిన రెండు మూడు రోజుల వరకూ ఆయనకు సంబంధించిన వార్తలు చాలా తక్కువగానే వచ్చాయి. తెలుగులో పోలిస్తే ఇంగ్లిషు మీడియాలో అందునా ఒకట్రెండు మీడియా సంస్థలు మాత్రమే కాస్త ఎక్కువగా ఫోకస్ చేశాయి. తర్వాత ఆయన గురించి దాదాపుగా మర్చిపోయాయి. ఈ మధ్యనే తెలుగు మీడియాకు సంబంధించి ఒకట్రెండు సంస్థల్లో కాస్త చిన్నగా ప్రమాదం చేసిన కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన లాయర్ల ద్వారా సదరు యువ పారిశ్రామికవేత్త తాను చేసిన ప్రమాదం గురించి తన లాయర్ల ద్వారా కోర్టులో వినిపించిన వాదన అవాక్కు అయ్యేలా చేసింది. తన వరకు తాను బుద్దిగా గంటకు 40కి.మీ. వేగంతోనే కారును నడిపానని.. కానీ ఫ్లైఓవర్ డిజైన్ ఎస్ ఆకారంలో ఉందని.. దానికున్న సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం జరిగింది తప్పించి.. తన తప్పు ఏమీ లేదన్నట్లుగా పేర్కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రమాదం జరిగిన రోజునే.. అతడి కారు గంటకు 104కి.మీ. వేగంతో దూసుకెళ్లినట్లుగా స్పీడ్ గన్ ద్వారా తెలుసుకొని.. అతడికి చలానా వేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అయితే.. అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయటం ఒక ఎత్తు అయితే.. సంపన్న కుటుంబాలకు చెందిన వారు చేసిన తప్పుల్ని మీడియాలో పెద్దగా ఎందుకు చూపించరు? అలాంటి వాటిని మీడియా ఎందుకు మర్చిపోతుంది? అన్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్రమాదం జరిగిన వెంటనే ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రాం లాంటి తన సోషల్ మీడియా ఖాతాల్ని తొలగించిన వైనం చూస్తే.. పెద్దింటి బిడ్దల తెలివే తెలివి అన్న మాట మనసులోకి రాక మానదు.