Begin typing your search above and press return to search.

మోహుల్‌ చోక్సీ కోసం సీబీఐ - ఈడీ..!

By:  Tupaki Desk   |   27 Jan 2019 5:33 AM GMT
మోహుల్‌ చోక్సీ కోసం  సీబీఐ - ఈడీ..!
X
కోట్లాది రూపాయలు కొల్లగొట్టి - బ్యాంకులకు ఎగనామం పెట్టిన ఆర్థిక ఉగ్రవాది మోహుల్‌ చోక్సీని పట్టుకునేందుకు భారత అధికారులు రంగం సిద్ధం చేశారు. అతడిని భారత్‌ తీసుకొచ్చేందుకు మార్గం సుగమం కావడంతో ఆయన కోసం సీబీఐ(సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) - ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టోరేట్‌(ఈడీ) అధికారులు ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లు సమాచారం. వజ్రాల వ్యాపారం పేరుతో బ్యాంకులను మోసం చేసిన నీరవ్‌ మోడీకి మోహుల్‌ చోక్సీ మేనమామ.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.13 వేల కోట్ల కుంభకోణంలో మోహుల్‌ చోక్సీ ప్రధాన నిందితుడు. బ్యాంకింగ్‌ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంగా దీనిని పేర్కొన్నారు. అయితే కోట్లు కొల్లగొట్టిన మోహుల్‌ చోక్సీ గత సంవత్సరం జనవరి 4న విదేశాలకు పరారయ్యాడు. వెస్టీండీస్‌ లోని కరెబియన్‌ అడవుల్లో ఆయన ఆక్రమంగా నివాసం ఉంటున్నాడు. ఇక్కడ యాంటిగ్వా పౌరసత్వాన్ని కూడా తీసుకున్నారు. వీసాలు లేకుండానే ఇక్కడి ప్రభుత్వం 132 దేశాల వారికి పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం ఇస్తుంది. పెట్టుబడుల నెపంతో చాలా మంది ఆర్థిక నేరగాళ్లు ఇక్కడ తలదాచుకుంటారు.

దీంతో ఆయనను తీసుకొచ్చేందుకు ఆ దేశాల అధికారులతో భారత్‌ సంప్రదింపులు జరిపింది. గత సంవత్సరంలోనే మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి ఇపి చెట్‌ గ్రీన్‌ తో సమావేశమయ్యారు. దీంతో మోహుల్‌ చోక్సీని పంపించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో అధికారులు బోయింగ్‌ విమానంలో మోహుల్‌ చోక్సీని తీసుకొచ్చేందుకు బయలుదేరినట్లు సమాచారం. కాగా ఆయన పాస్‌పోర్టును గత ఏడాది ఫిబ్రవరిలోనే భారత్‌ రద్దు చేసింది.

అలాగే నీరవ్‌ మోడీని తీసుకొచ్చేందుకు భారత్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే సాంకేతికపరమైన చిక్కులు రావడంతో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.