Begin typing your search above and press return to search.

ఇదేం ట్విస్ట్ : ఆస్తుల కోస‌మే విలీన‌మా? టీడీపీ పసిగట్టేసిందా?

By:  Tupaki Desk   |   9 Jun 2022 5:30 AM GMT
ఇదేం ట్విస్ట్ : ఆస్తుల కోస‌మే విలీన‌మా? టీడీపీ పసిగట్టేసిందా?
X
పుర‌పాల‌నకు సంబంధించి మ‌రో కొత్త విధానం ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. ఈ విధానం ప్ర‌కారం పుర‌పాల‌క పాఠ‌శాల‌లు అన్నీ విద్యాశాఖ‌లో విలీనం కానున్నాయి. కానీ ఆస్తులు అన్నీ పురపాల‌క శాఖ ప‌రిధిలోనే ఉండ‌నున్నాయి. ఇదే ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నాత్మ‌కం కానుంది. ఎందుకంటే చ‌దువుల విష‌య‌మై విద్యాశాఖకు అప్ప‌గించి, ఆస్తుల వ‌ర‌కూ మాత్రం పుర‌పాల‌క శాఖ‌కు ఎందుకు అప్ప‌గించారో ఇక్క‌డున్న మ‌త‌ల‌బేంటో తెలియ‌డం లేద‌ని విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్పందించారు.

రాష్ట్రంలోని 2115 పుర‌పాల‌క పాఠ‌శాల‌ల ఆస్తుల కోస‌మే ప్ర‌భుత్వం విలీన ప్ర‌క్రియ‌ను తెర‌పైకి తెచ్చింది. విలీన ప్ర‌క్రియ నిర్ణ‌యంతో నాలుగున్నర ల‌క్ష‌ల మంది విద్యార్థుల జీవితాల‌ను ప‌ణంగా పెడ‌తారా? విద్యాశాఖ‌లో మున్సిప‌ల్ స్కూళ్ల విలీనం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విలీనానికి ప్ర‌య‌త్నించిన వైసీపీ ప్ర‌భుత్వం క‌న్ను తాజాగా పుర పాల‌క పాఠ‌శాల‌ల మీద ప‌డింది. విలీనం త‌రువాత బోధ‌నేత‌ర సిబ్బందికి జీతాలు, విద్యుత్ బిల్లులు ఎవ‌రు చెల్లిస్తారో చెప్పాలి. ఈ ప్ర‌క్రియ‌లో ఉపాధ్యాయుల వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బ‌డుగు,బ‌ల‌హీన వ‌ర్గాల విద్యార్థుల‌ను తీర్చిదిద్ద‌డంలో ఈ పాఠ‌శాల‌లు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అలాంటి పాఠ‌శాల‌ల విలీనంను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాం. అని చెప్పారాయ‌న.

ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్... ఇక శ్రీ‌కాకుళం లాంటి మారుమూల ప్రాంతాల‌లో కూడా పుర‌పాల‌క పాఠ‌శాల‌ల‌కు మంచి ఆస్తులే ఉన్నాయి. ఖరీద‌యిన స్థ‌లాలు ఉన్నాయి. ఇప్ప‌టికే న‌గ‌రంలో మూడు ఉన్న‌త పాఠ‌శాల‌లు మంచి సేవ‌లు అందిస్తున్నాయి. ప‌స‌గాడ సూర్య‌నారాయ‌ణ మున్సిప‌ల్ హై స్కూల్ కు అయితే ఎంతో చరిత్ర ఉంది. ఈ పాఠ‌శాల‌కు సువిశాల‌మైన గ్రౌండ్ ఉంది.

అదేవిధంగా ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ కు కూడా ఎంతో పేరుంది. ఇక్క‌డ గ్రౌండ్ పై కూడా ఉంది. ఇవి కాకుండా ప‌ట్ట‌ణంలో టంగుటూరి ప్ర‌కాశం పంతులు పేరిట క‌లెక్ట‌రేట్ దారిలో మ‌రో మున్సిప‌ల్ హై స్కూల్ ఉంది. ఇవ‌న్నీ మంచి సేవ‌లు అందిస్తున్నాయి. అయితే భారీ బ‌హిరంగ స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎన్టీఆర్ హై స్కూల్ గ్రౌండ్ ను త‌రుచూ వినియోగిస్తుంటారు. ఈ పాఠశాల శిధిలావ‌స్థ‌కు చేరుకుంటే పూర్వ విద్యార్థులే దాతలుగా మారి పాఠ‌శాల అభివృద్ధికి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించడం విశేషం.

అదేవిధంగా నాడు నేడు లో భాగంగా పీఎస్ఎన్ఎంహెచ్ స్కూలుకు కూడా రూపు రేఖ‌లు మారాయి. ఇక్క‌డ పాఠ‌శాల గ్రౌండ్ కూడా చాలా పెద్ద‌ది. వాకింగ్ ట్రాక్ కూడా ఇక్క‌డ ఉంది. ఈ రెండు పాఠ‌శాల‌లు కూడా పాఠ్యాంశాల బోధ‌న‌లో మంచి పేరు తెచ్చుకున్నాయి. సువిశాల ప్రాంగ‌ణాలు ఉన్న ఈ రెండు పాఠ‌శాల‌ల‌నూ విద్యా శాఖ‌లో విలీనం చేస్తే సంబంధిత ఆస్తులు అన్న‌వి ప్ర‌భుత్వ ప‌రం చేసుకుని తీరాల‌న్న, త‌ద్వారా వాటిని లీజుకు ఇచ్చి ఆదాయం పిండుకోవాల‌ని, పెంచుకోవాల‌ని ఆలోచ‌న‌లో జ‌గ‌న్ సర్కారు ఉన్న‌ద‌ని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇదేవిధంగా మున్సిప‌ల్ శాఖ ప‌రిధిలోనే ప‌లు ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు కూడా న‌డుస్తున్నాయి. ఇవి కూడా పేద విద్యార్థుల‌కు ఎంతో అందుబాటులో ఉన్నాయి.వీటికి కూడా కొద్దో గొప్పో ఆస్తులున్నాయి. పాఠ‌శాల‌ల విలీనం త‌రువాత..కొన్ని భ‌వ‌నాలు మిగిలిపోతే వాటిని వేలం వేయ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌నలో కూడా ప్ర‌భుత్వం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కొద్దిపాటి వ‌న‌రుల‌తోనే ఈ పాఠ‌శాల‌లు న‌డుస్తున్నా ఇవ‌న్నీ పేద విద్యార్థుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని, క‌నుక వీటి విష‌య‌మై ప్ర‌భుత్వ పున‌రాలోచ‌న చేయాలని సంబంధిత ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు వేడుకుంటున్నారు.