Begin typing your search above and press return to search.

మోడీ హ‌వా త‌గ్గుతోందా... తాజా ఫ‌లితాలు ఏం చెబుతున్నాయ్‌..!

By:  Tupaki Desk   |   24 Oct 2019 10:58 AM GMT
మోడీ హ‌వా త‌గ్గుతోందా... తాజా ఫ‌లితాలు ఏం చెబుతున్నాయ్‌..!
X
కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్రభుత్వం హ‌వా త‌గ్గుతోంది. రెండో సారి కూడాపూర్తి మెజారిటీతో ఆయ‌న ఢిల్లీలో అధికారంలోకి వ‌చ్చినా.. ఈ ఐదు మాసాల కాలంలో ఆయ‌న చేసిన ప‌నుల‌ను ప్ర‌జ‌లు ఆహ్వానించే ప‌రిస్థితిలో లేరా? సాధార‌ణ, మ‌ధ్య త‌ర‌గతి వ‌ర్గాల్లో మోదీ మేనియా ప‌నిచేయ‌డం లేదా? అంటే.. తాజాగా వెల్ల‌డైన రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రెండు కీల‌క‌మైన రాష్ట్రాల్లో ఈ నెల‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అదికారంలో ఉంది. అయితే, మ‌రోసారి ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వ‌చ్చేందుకు క‌మ‌ల నాథులు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు.,

ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర‌, హ‌రియాణాల్లో బీజేపీ సార‌థి అమిత్ షా స‌హా సాక్షాత్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఇక్క‌డ ప‌ర్య‌టించి ఎన్నిక‌ల స‌భ‌లు నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు అనేక ఎక్స‌ర్ సైజ్‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే పాకిస్థాన్‌పై యుద్ధం అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. పుల్వామా దాడుల‌ను తెర‌మీదికి తెచ్చారు. క‌శ్మీర్‌కు ఆక్సిజ‌న్ అందించామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు నిర్బంధంలో కొట్టుకులాడిన శీత‌ల రాష్ట్రంలో స్వేచ్ఛావాయువులు అందించేందుకు ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేశామ‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, త‌మ‌కు పొంత‌న‌లేని మ‌హాత్మాగాంధీ 150 వ జ‌యంతిని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు.

ఇంత‌లా ఈ కార్య‌క్ర‌మాల‌ను భుజాన వేసుకోవ‌డానికి కార‌ణం.. ఈ రెండు రాష్ట్రాల్లోమ‌రోసారి క‌మ‌ల వికాసం కోసం క‌మ‌ల నాథులు ప‌రిత‌పించ‌డ‌మేన‌ని తెలిసిందే. ఇక‌, షా అయితే, త‌ర‌చుగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎంత బిజీగా ఉన్నా ప‌ర్య‌టించారు. అనేక‌ ప‌ర్య‌ట‌న‌ల‌ను కూడా వాయిదా వేసుకుని ఆయ‌న ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వ‌చ్చేందుకు వ్యూహాత్మ‌కంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. కానీ, అటు మ‌హారాష్ట్ర‌లో ఓట్లు సీట్లు త‌గ్గాయి. మ‌రోప‌క్క‌, హ‌రియాణాలో తీవ్రంగా డీలా ప‌డిపోయిన ప‌రిస్థితి. దీంతో మోదీ, షాల వ్యూహాలు ఈ ఎన్నిక‌ల్లో ఎక్క‌డా ప‌నిచేయ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌ధానంగా జాతీయ అంశాల‌ను రాష్ట్రాల‌కు ఆపాదించాల‌ని, రాష్ట్రాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను లైట్‌గా తీసుకో వ‌డం, చిన్న చిత‌కా ప‌రిశ్ర‌మలు మూత‌బ‌డి వంద‌లాది మంది కార్మికులు రోడ్డున ప‌డుతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం వంటివి ఇప్పుడు బీజేపీకి ఇబ్బందిగా మారింద‌ని అంటున్నారు. ఇక‌, రైతులు రోడ్ల‌మీద‌కి వ‌చ్చే ప‌రిస్థితిని క‌ల్పించారు. అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. సామాన్యుల‌కు క‌ల‌గ‌ని ఊర‌ట‌.. బ‌డా పారిశ్రామిక వేత్త‌ల రుణాల‌ను మాఫీ చేయ‌డం క‌ల్పించార‌నేది మోదీపై ఉన్న పెద్ద విమ‌ర్శ‌. ఇది తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌స్ఫుట‌మైంది. అదేస‌మ‌యంలో జీఎస్టీ కూడాప్ర‌భావం చూపించింది. మొత్తంగా చూసుకుంటే.. నేల విడిచి సాము చేస్తున్న మోదీకి ఈ ఫ‌లితాలు క‌నువిప్పుక‌లిగిస్తాయ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు