Begin typing your search above and press return to search.

వైజాగ్ స్టీల్స్ ను ముంచేస్తున్న మోడీ సర్కార్

By:  Tupaki Desk   |   5 Aug 2022 5:42 AM GMT
వైజాగ్ స్టీల్స్ ను ముంచేస్తున్న మోడీ సర్కార్
X
కుక్కను చంపాలంటే ముందు దానికి పిచ్చిదనే ముద్రేయాలని నానుడి. వైజాగ్ స్టీల్స్ విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ అదే పని చేస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని డిసైడ్ చేసిన మోడీ ప్రభుత్వం అందుకు తగ్గట్లే చర్యలు తీసుకుంటోంది. అన్నీ వైపుల నుండి ఫ్యాక్టరీని దెబ్బ కొట్టేస్తోంది. అన్నిరకాలుగా ఫ్యాక్టరీని నాశనం చేసి దాని విలువ క్షీణించిపోయేట్లు చేసి అప్పుడు నష్టాల్లో కూరుకుపోయిందనే ముద్రేసి అమ్మేసేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది.

తాజా పరిణామాల ప్రకారం ఒకవైపు ఫ్యాక్టరీకి అందాల్సిన ముడిసరుకు సరఫరాను బాగా తగ్గించేస్తోంది. ఇంకోవైపు ఆర్థిక సాయం అందకుండా ఇబ్బందులు పెడుతోంది. మరోవైపు ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించేస్తోంది.

ప్రమోషన్ పాలసీని రద్దుచేసి రెండేళ్ళుగా ప్రమోషన్లు నిలిపేసింది. దాంతో ఫ్యాక్టరీలోనే ఉంటే భవిష్యత్తు ఉండదన్న కారణంగా చాలామంది ఉన్నతాధికారులు ఉక్కు ఫ్యాక్టరీ ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. గడచిన ఏడాదిలో సుమారు 100 మంది ఉన్నతాధికారులు ఫ్యాక్టరీని వదిలేసి వెళ్ళిపోయారు.

ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే ఉక్కు ఉత్పత్తి బాగా పెరుగుతుందని, అందుకు అవసరమైన ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, నష్టాలు తగ్గిపోయి లాభాలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.

అయితే కేంద్రం చెబుతున్నదంతా అబద్ధాలే అని అందరికీ తెలుసు. ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే ముందు వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, ఉద్యోగులను తీసేయటం ఖాయం. వాళ్ళ స్థానంలో కొత్తగా తమ ఉద్యోగులను నియమించుకుంటారు. అలాగే ఫ్యాక్టరీకి ఉన్న భూములను అమ్ముకుంటారు.

రియల్ ఎస్టేట్ వ్యాల్యూ విపరీతంగా ఉన్న కారణంగా ఫ్యాక్టరీ భూములను అమ్ముకుంటేనే వేల కోట్ల రూపాయలు వచ్చేస్తుంది. ఈ డబ్బు పెట్టుకుని కొంతకాలం షో రన్ చేసి తర్వాత అన్నీ భూములను అమ్మేస్తారు. చివరకు ఉద్యోగులందరినీ తీసేసి ఫ్యాక్టరీని మూసేస్తారు. లేదా నూరుశాతం తమ ఉద్యోగులను పెట్టుకుని ఫ్యాక్టరీని నడిపిస్తారు. రెండింటిలో ఏది జరిగినా అంతిమంగా నష్టపోయేది ఉద్యోగులు, కార్మికులే అన్నది వాస్తవం.