Begin typing your search above and press return to search.

మోడీ టార్గెట్ కాంగ్రెస్ కాదా? గాంధీ కుటుంబమేనా?

By:  Tupaki Desk   |   9 Feb 2022 10:30 AM GMT
మోడీ టార్గెట్ కాంగ్రెస్ కాదా? గాంధీ కుటుంబమేనా?
X
ఎప్పటి అంజయ్య.. ఇప్పుడు గుర్తుకు రావటం ఏమిటి? ఎన్టీఆర్ ను అర్ధాంతరంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి.. నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టటమే కాదు.. దాన్ని ప్రశ్నించిన ఎన్టీఆర్ ను జైల్లో పడేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. ఆ మాటకు వస్తే.. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు మీద ఆడిపోసుకునే వారంతా కూడా.. అంతకు ముందు ఎన్టీఆర్ ను కాంగ్రెస్ గద్దె దింపిందని.. ఆయన్ను తోసేసి.. ఆయన పార్టీకి చెందిన నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా అధికార పగ్గాల్ని అప్పజెప్పిన వైనాన్ని ఇప్పటి తరానికి పెద్దగా తెలిసింది లేదు.

కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన పాడు పనికి ఏపీ ప్రజలు అప్పట్లోనే ఘాటుగా బుద్ధి చెప్పటమే కాదు.. మళ్లీ అలాంటి ఎదవ పనులు చేసే సాహసం చేయకుండా నిలువరించటంలో తెలుగు ప్రజలు సక్సెస్ అయ్యారని చెప్పాలి. నిజానికి చంద్రబాబు మీద వెన్నుపోటు ముద్ర వేస్తారు కానీ.. నిజంగానే వెన్నుపోటు పొడిచే ఉంటే.. నాదెండ్ల హయాంలో జరిగినట్లుగా ఏపీ వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తేది కదా? అలాంటిదేమీ లేకుండా ఉండటం దేనికి నిదర్శనం? చంద్రబాబుకు విషయాల్ని చెప్పుకోవటం చేతకాక పోవటం వల్లే.. ఇంతకాలం వెన్నుపోటు దారుడిగా ముద్ర వేయించుకుంటూ ఉన్నారు. చంద్రబాబు స్థానంలో మరే నేత ఉన్నా.. తన మీద జరుగుతున్న విష ప్రచారాన్ని మొగ్గలోనే తుంచేసేవారు.

ఇప్పటికి ఆయన ప్రత్యర్థులు వెన్నుపోటుదారుగా అభివర్ణిస్తుంటారు. నిజంగానే ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ఉంటే.. ఏపీ ప్రజలు చూస్తూ ఉండరు కదా? ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇవాల్టి రోజున చంద్రబాబును వెన్నుపోటు దారుడిగా అభివర్ణించే కేసీఆర్.. అదే చంద్రబాబు నాయకత్వంలో పని చేసిన వైనాన్ని మర్చిపోకూడదు. బాబును విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా 2009లో చంద్రబాబుతో కలిసి ఎన్నికల బరిలో దిగటాన్ని మర్చిపోకూడదు.

ఏపీ మంత్రిగా వ్యవహరిస్తూ.. ఏ మాత్రం అవకాశం వచ్చినా చంద్రబాబును విమర్శలతో చీల్చి చెండాడే కొడాలి నాని సైతం..చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లుగా చెప్పే సమయంలో ఆయనతోనే ఉన్నారు తప్పించి.. తన దైవంగా చెప్పే ఎన్టీఆర్ పక్షాన ఎందుకు నిలవలేదన్నది ప్రశ్న. అప్పుడు బుద్ధి తక్కువైందని చెప్పే కొడాలి నానికి.. ఇన్నేళ్లకు బుద్ధి రావటం ఏమిటి? మరో పదేళ్ల తర్వాత తాను జగన్ పార్టీలో చేరి తప్పు చేశానని.. అప్పట్లో బుద్ధి గడ్డి తినిందని వ్యాఖ్యానించే అవకాశం లేదని చెప్పగలమా?

చంద్రబాబు ఎపిసోడ్ ను పక్కన పెడితే.. అంజయ్య ఉదంతాన్ని మోడీ ప్రస్తావించటం చూస్తే.. ఆయన ఎజెండా ఏమిటన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. విమానాశ్రయంలో ప్రొటోకాల్‌ ఏర్పాట్లు సరిగా చేయలేదన్న చిన్న కారణంతో నాటి సీఎం టి.అంజయ్యను పదవి నుంచి తొలగించారన్న మోడీ మాటల అసలు ఉద్దేశం ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకున్నవే. గోవాకు అన్యాయం చేశారని నెహ్రూను.. సిక్కుల ఊచకోత.. అంజయ్య.. ఎన్టీఆర్ లను అన్యాయంగా పదవి నుంచి దిం చేశారంటూ ఇందిరను.. రాజీవ్ ను టార్గెట్ చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇదంతా చూస్తే.. అర్థమయ్యేదేమంటే.. మోడీ అసలు లక్ష్యం కాంగ్రెస్ ఎంతమాత్రం కాదని.. దానికి బలమైన పునాదిగా ఉండే గాంధీ కుటుంబమనే చెప్పాలి. సిక్కుల ఊచకోతను ప్రస్తావిస్తున్న మోడీ.. ఇప్పుడు పంజాబ్ అధికార పగ్గాలు ఉన్నది అదే కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే అన్న విషయం తెలీదా? అంటే.. సిక్కులు కాంగ్రెస్ పార్టీని క్షమించినా.. మోడీ మాష్టారు మాత్రం ఆ అంశాన్ని తాజాగా కెలుకుతున్నది దేనికి? అన్నది చూస్తే.. సమాధానం ఐదు రాష్ట్రాల ఎన్నికలే అన్నది అర్థం కాక మానదు.