Begin typing your search above and press return to search.

భారతీయుల‌ ప్రాణాల విష‌యంలో కీల‌క ష‌ర‌తుకు మోడీ ఓకే?

By:  Tupaki Desk   |   2 Jun 2021 10:32 AM GMT
భారతీయుల‌ ప్రాణాల విష‌యంలో కీల‌క ష‌ర‌తుకు మోడీ ఓకే?
X
దేశంలో ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతుంటే మ‌రోవైపు అందరి దృష్టి ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తికి బ్రేక్ వేసే వ్యాక్సిన్ల‌పై ప‌డింది. అయితే, వ్యాక్సిన్ల కొర‌త స‌మ‌స్య మ‌న‌ల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఈ స‌మ‌యంలో వచ్చే జూలై లేదా ఆగస్టు తొలివారం నాటికి రోజుకు సగటున కోటి మందికి కరోనా టీకాలు వేసే దశకు చేరుకుంటామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ మేరకు టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ క‌స‌రత్తులో ఓ క‌ఠిన‌మైన నిబంధ‌న‌కు కేంద్రం ఓకే చెప్పింద‌ని ప‌లు వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది డిసెంబరు కల్లా దేశంలో అందరికీ వ్యాక్సిన్‌ వేయటం పూర్తవుతుందన్న ఆశాభావంతో ఉన్నామని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ విలేకర్లతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశంలో 21.60 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ వేశాం. ఇది దాదాపు అమెరికాలో జరిగిన వ్యాక్సినేషన్‌తో సమానం. మరోవైపు, అమెరికా జనాభాకన్నా మన జనాభా నాలుగు రెట్లు అధికం’ అని పేర్కొన్నారు. తొలిడోసు ఏ టీకా వేసుకుంటే.. రెండోడోసూ ఆ టీకానే తీసుకోవాలి అని కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

ఇదిలాఉండగా, మ‌న‌దేశంలో టీకాల కొరతను అధిగమించేదుకు విదేశాల్లో ఆమోదించిన క‌రోనా టీకాలకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని కేంద్రం ప్ర‌క‌టించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటుగా కొన్ని దేశాలు ఆమోదించిన కొవిడ్‌19 టీకాలు బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించడం ద్వారా అవి భారతీయులపై ఎలా ప్రభావం చూపిస్తాయో విశ్లేషించేవారు.అయితే, భారత్‌లో బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతోపాటుగా ఫైజర్‌, మోడర్నా కంపెనీల యొక్క టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారాల అంశాలు వస్తే భారత ప్రభుత్వమే బాధ్యత వ‌హించే ష‌ర‌తుకు కూడా మ‌న‌దేశం ఓకే చెప్పేసింది. కొవిడ్‌ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉంటే బాధితులు కోర్టుకు వెళ్లకుండానే పరిహారం అందజేస్తుంది. కాగా, నిబంధ‌న‌లపై ప్ర‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్‌, కెనడా, జపాన్‌, అర్జెంటీనా వంటి దేశాలు సైతం ఈ ష‌ర‌తుల‌కు ఓకే చెప్పాయ‌ని అనుకూల వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.