Begin typing your search above and press return to search.

ఆ న‌టి ఏపీ రాజ‌కీయాల‌ను వ‌దిలి తెలంగాణ‌కు పోతోందా?

By:  Tupaki Desk   |   8 Sep 2022 7:09 AM GMT
ఆ న‌టి ఏపీ రాజ‌కీయాల‌ను వ‌దిలి తెలంగాణ‌కు పోతోందా?
X
ఇటీవ‌ల టీడీపీకి రాజీనామా చేసిన ప్ర‌ముఖ సినీ న‌టి దివ్య‌వాణి బీజేపీలో చేర‌బోతున్నారా అంటే అవున‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె తాజాగా తెలంగాణ బీజేపీ చేరిక‌ల క‌మిటీ చైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్‌తో స‌మావేశం కావ‌డం ఇందుకు బ‌లం చేకూరుస్తోంద‌ని అంటున్నారు. హైద‌రాబాద్‌లోని శామీర్‌పేట‌లో ఉన్న ఈట‌ల రాజేందర్ నివాసంలో ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరికకు సంబంధించి చర్చలు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

బీజేపీ ఇటీవ‌ల కాలంలో సినీ రంగానికి చెందిన‌వారిపై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవ‌ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. ప్ర‌ముఖ హీరో నితిన్‌తోనూ హైద‌రాబాద్‌లో భేటీ అయ్యారు.

బీజేపీలో చేరాల‌ని వారిని ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ద‌క్షిణ భార‌త‌దేశంపై దృష్టి సారించిన బీజేపీ సినీ రంగానికి చెందిన హీరో సురేష్ గోపి (కేర‌ళ‌), ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా (త‌మిళ‌నాడు), ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ల‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది.

ఈ క్ర‌మంలో మ‌రికొంద‌రి నటుల‌పై దృష్టి సారించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో దివ్యవాణి.. ఈట‌ల రాజేంద‌ర్‌తో భేటీ కావ‌డం ఆస‌క్తి రేపుతోంది. కొద్ది నెల‌ల క్రితం ఆమె టీడీపీకి రాజీనామా చేశారు.

తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాని అప్ప‌ట్లో ఆమె తెలిపారు. ఆ త‌ర్వాత ప‌లు యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ దివ్య‌వాణి టీడీపీ నాయ‌క‌త్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

వైఎస్ఆర్సీపీలో దివ్య‌వాణి చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు ముందుగానే వైఎస్సార్సీపీ నేత‌ల‌తో మాట్లాడుకుని టీడీపీపై ఆమె విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. కాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య‌వాణి.. రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా వ‌చ్చిన పెళ్లి పుస్త‌కం వంటి సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.