Begin typing your search above and press return to search.

ఈ టీడీపీ ఎంపీకి!... ఈ సారి టికెట్ ద‌క్క‌దా?

By:  Tupaki Desk   |   26 Feb 2019 12:48 PM GMT
ఈ టీడీపీ ఎంపీకి!... ఈ సారి టికెట్ ద‌క్క‌దా?
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత‌ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. సిట్టింగులైనా కూడా ఈ ద‌ఫా ఒకింత ఎదురీత త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తుంటే... కొత్తొళ్లు కూడా త‌మ‌కు ఈ సారైనా అవ‌కాశం ద‌క్కుతుందా? లేదా? అన్న డైల‌మాలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్ర‌త్యేకించి సిట్టింగుల్లో చాలా మందిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వారిని అయోమ‌యానికి గురి చేస్తోంది. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఓకే గానీ.. సొంత పార్టీ కార్య‌క‌ర్త‌ల్లోనే ఈ త‌ర‌హా అసంతృప్తి చాలా మందికి నిద్ర లేని రాత్రుల‌నే మిగులుస్తోందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి వారిలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ, టీడీపీ సీనియ‌ర్ నేత ముర‌ళీమోహ‌న్‌ కు నిజంగానే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంద‌ట‌. ఈ ద‌ఫా ముర‌ళీమోహ‌న్‌ కు టికెట్ ఇస్తే... తాము స‌హ‌క‌రించేది లేద‌ని తెలుగు తమ్ముళ్లు ఏకంగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్న ప‌రిస్థితి ఆయ‌న‌కు నిజంగానే షాకింగ్‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన ముర‌ళీమోహ‌న్‌... ఈ ఐదేళ్లలో త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అస‌లు ప‌ట్టించుకున్న పాపానే పోలేద‌ట‌. ఈ ఐదేళ్ల‌లో స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని, అస‌లు మీ హ‌యాంలో ఎక్క‌డ ఏం ప‌నులు చేశారో చెప్పాల‌ని స్వ‌యంగా తెలుగు త‌మ్ముళ్లే నిల‌దీస్తుంటే... ముర‌ళీమోహ‌న్ క‌క్క‌లేక‌, మింగ‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ట‌. జ‌నం, పార్టీ కేడ‌ర్ ఏ మాట అంటున్నా... అధిష్ఠానం, పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా పేరుప‌డ్డ ముర‌ళీమోహ‌న్‌... చివ‌రి నిమిషంలో అయినా టికెట్ ద‌క్కించుకుంటాన‌న్న ధీమాతో ఉన్నార‌ట‌. అయితే ఆయ‌న ప‌నితీరుపై అధిష్ఠానం రూపొందించిన నివేదిక ఆయ‌న‌కు చుక్క‌లు చూపే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఇప్పుడు ముర‌ళీమోహ‌న్ ప‌రిస్థితి చాలా అయోమ‌యంగా ఉన్న‌ట్లుగా సొంత పార్టీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ‌ట‌.

అవ‌కాశం చిక్కినా.. ఐదేళ్ల‌లో చేసిందేమీ లేద‌ని చెబుతున్న రాజ‌మండ్రి త‌మ్ముళ్లు... ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న‌కే టికెట్ కేటాయిస్తే మాత్రం త‌మ మ‌ద్ద‌తు విష‌యంలో పున‌రాలోచించుకోవాల్సి వ‌స్తుంద‌ని బ‌హిరంగంగానే చెబుతున్నార‌ట‌. ఐదేళ్ల పాటు యాక్టింగ్‌ తోనే నెట్టుకొచ్చేసిన ముర‌ళీమోహ‌న్‌... యాక్టింగ్ ఎంపీగానే పేరు గ‌డించార‌ని, ఈ త‌ర‌హా యాక్టింగ్ నేత కంటే... ఉత్సాహంగా ప‌నిచేసే యువ‌కుల్లో ఎవ‌రికో ఒక‌రికి టికెట్ కేటాయిస్తే పార్టీ ప్ర‌తిష్ఠ పెరుగుతుంద‌ని త‌మ్ముళ్లు భావిస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే అధిష్ఠానానికి చేర‌వేశామ‌ని, చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యంపైనే తాము ఎలా ప‌నిచేయాల‌న్న విష‌యం ఆధార ప‌డి ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. మొత్తంగా ఈ త‌ర‌హా ప‌రిస్థితితో ఇప్పుడు ముర‌ళీమోహ‌న్ తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.