Begin typing your search above and press return to search.

ఈఎస్ ఐ స్కాంలో మరో మంత్రి లోకేష్ నేనా?

By:  Tupaki Desk   |   12 Jun 2020 4:15 AM GMT
ఈఎస్ ఐ స్కాంలో మరో మంత్రి లోకేష్ నేనా?
X
అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభానికి ముందు ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. టీడీపీకి జగన్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఈఎస్ ఐ స్కామ్ లో ఆరునెలలుగా విచారణ చేస్తున్న ఏసీబీ పక్కా ఆధారాలతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఉన్న అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

*200 కోట్ల స్కామ్ లో వైద్యుడు కీలకం..

2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పనిచేశారు. 2017వరకు అదేశాఖలో కొనసాగారు. తెలంగాణలో ఈఎస్ఐ అధికారి దేవికారాణి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఏపీలోనూ ఈఎస్ ఐ స్కాం వ్యవహారాలపై సీఎం జగన్ విజిలెన్స్ తో విచారణ చేయించారు. విచారణలో భాగంగా తిరుపతిలోని ఓ వైద్యుడు ఇచ్చిన సమాచారం కీలక సమాచారం ఆధారంగా తీగలాగితే డొంక కదిలింది. మంత్రి పేషీ నుంచి వచ్చిన వత్తిళ్ల కారణంగా ఈ స్కాంలో నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఖరారు చేయించారని విచారణలో తేలింది. కాంట్రాక్టులు లేని కంపెనీలకు ఈఎస్ ఐ డైరెక్టర్లు రూ.51 కోట్లు చెల్లించినట్టు దర్యాప్తులో తేలింది.

*136శాతం అధిక ధరలు చెల్లింపు

ఏసీబీ ఈ విచారణలో పక్కా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. మందులు పరికరాలు వాస్తవ ధరకంటే 136శాతం అధికంగా ధరలు చెల్లించినట్టు ఆధారాలతో సహా ఏసీబీ నిరూపించింది. అచ్చెన్నను అరెస్ట్ చేసింది.

*స్కామ్ లో మరో మాజీ మంత్రి లోకేష్ ప్రమేయంపై ఆరా?

ఈఎస్ఐ కొనుగోళ్ల టెండరింగ్ లో అచ్చెన్నాయుడితోపాటుగా మరో మాజీ మంత్రి ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమికంగా తేల్చారు. నామినేటెడ్ పనులును ఇచ్చి హవాలా ద్వారా డబ్బులు తరలించారు అని అనుకుంటున్నారు. నామినేటెడ్ వర్క్స్ ఇవ్వండి అని చెప్పింది మాజీ మంత్రి లోకేష్ అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. అచ్చెన్నను అరెస్ట్ చేసిన ఏసీబీ ఇప్పుడు మాజీ మంత్రి కుటుంబసభ్యులను విచారించనున్నట్టు తెలుస్తోంది. అచ్చెన్న ఆదేశాల మేరకు నాడు డీఐఎంఎస్ డైరెక్టర్ రమేష్ కుమార్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చినట్టు విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ ఈఎస్ఐ స్కాంలో 155 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మాజీ మంత్రి సైతం ఏసీబీ వలలో చిక్కుకున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.