Begin typing your search above and press return to search.

నాన్ బీజేపీ కూటమి ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   20 Oct 2022 5:21 AM GMT
నాన్ బీజేపీ కూటమి ఖాయమేనా ?
X
తొందరలోనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాన్ బీజేపీ కూటమి ఏర్పడటం ఖాయమనిపిస్తోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు, పవన కల్యాణ్ చేతులు కలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇపుడు చేతులు కలిపినా భవిష్యత్తులో ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రజాస్వామ్య పరిరక్షణకు మిగిలిన ప్రతిపక్షాలు కూడా చేతులు కలపాలని చంద్రబాబు పిలుపిచ్చారు. దీనికి వెంటనే సీపీఐ సానుకూలంగా స్పందించింది. జగన్ పాలనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో తాము కూడా భాగస్తులమవుతామని చెప్పింది.

సీపీఎం సంగతి ఇంకా తేలలేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నది లేదు కాబట్టి కలిసినా కలవకపోయినా జరిగే లాభనష్టాలు ఏమీలేవు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. చంద్రబాబుతో కలవటానికి బీజేపీ ఇష్టపడటంలేదు.

ఇదే సమయంలో వామపక్షాలున్న కూటమిలో బీజేపీ ఎలాగూ ఉండలేదు. కాబట్టి ఏ విధంగా చూసినా నాన్ బీజేపీ కూటమి ఏర్పాటయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ, జనసేన ఇంకా మిత్రపక్షాలే అన్న విషయం అందరికీ తెలిసిందే.

బీజేపీ పై పవన్ అసంతృప్తిని వ్యక్తంచేశారే కానీ కటీఫ్ చెప్పలేదు. కాబట్టి సాంకేతికంగా రెండుపార్టీలు ఇంకా మిత్రపక్షాలే. కాకపోతే చంద్రబాబుతో పవన్ చేతులు కలిపిన కారణంగా బీజేపీతో విడిపోతున్నట్లు ప్రకటించటం ఒక్కటే మిగిలింది. చంద్రబాబు, పవన్ కలిసిపోతారనే విషయాన్ని అందరు ఎప్పటినుండో ఊహిస్తున్నదే.

సో ఇపుడిదే విషయమై తొందరలోనే హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ అవబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమాలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ముందు తమ మూడు పార్టీలు కార్యాచరణను మొదలుపెడితే తర్వాత కలిసొచ్చే పార్టీలు వస్తాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి నాన్ బీజేపీ కూటమి కార్యాచరణ తొందరలోనే బయటకు వచ్చే అవకాశముంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.