Begin typing your search above and press return to search.

నార్త్ కొరియా 'కిమ్' ఇంత దొంగనా?

By:  Tupaki Desk   |   15 April 2022 11:10 AM GMT
నార్త్ కొరియా కిమ్ ఇంత దొంగనా?
X
ఉత్తర కొరియాను నియంతగా పాలిస్తున్న కిమ్ జాంగ్ ఉన్ యవ్వరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడి ఆకృత్యాలకు సంబంధించిన ఇప్పటికే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా దేశాన్ని మొండిగా నడిపిస్తున్నాడు ఈ నియంత.. ఏకంగా క్షిపణులు తయారు చేసుకొని పక్క దేశాలను, అమెరికాను భయపెడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా అమెరికా డాలర్లనే వెనక్కి నెట్టేలా కొత్త ఐడియాలతో చెలరేగిపోతున్నాడు.

అమెరికా కరెన్సీ అయిన డాలర్ ప్రపంచ కరెన్సీగా ఉంది. అయితే క్షిపణులు తయారు చేయడంతో అమెరికా ఆంక్షలు విధించింది. వాటిని తప్పించుకొని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టారు. మరి క్రిఫ్టోలను తయారు చేయడానికి ఉత్తరకొరియాలో విద్యుత్ లేదు. రాత్రి వేళ అక్కడ నగరాలన్నీ చీకట్లోనే మగ్గుతాయి. అయితే వీటి తయారీ కోసం కిమ్ తన దగ్గరుండే జాతిరత్నాల్లాంటి హ్యాకర్లను నమ్ముకున్నాడు.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ చేంజీల్లోకి చొరబడి దోపిడీ చేయగలగడం ఈ కిమ్ జాంగ్ ఉన్ దగ్గర ఉండే నేర్పరులైన హ్యాకర్ల పని. ఆ సొమ్ముతో కిమ్ ఆయుధ ప్రయోగాలు చేస్తుంటాడు.

తాజాగా కిమ్ ఆధ్వర్యంలోని హ్యాకర్ల దెబ్బకు మరో రూ.4500 కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీలకు కన్నం పడినట్టు తెలిసింది. తాజాగా ఉత్తరకొరియాకు చెందిన కిమ్ హ్యాకింగ్ బృందాలు ఓ వీడియో గేమ్ నెట్ వర్క్ ను వాడుకొని 620 మిలియన్ డాలర్ల విలువైన ఇథేరియం అనే క్రిప్టో కరెన్సీని దొంగిలించారు. ఈ విషయాన్ని మార్చి 29న అధికారికంగా ప్రకటించడంతో అందరూ అవాక్కరయ్యారు. ఈ వీడియో గేమ్ లో వినియోగదారులు క్రిప్టోలను ఒకరి నుంచి మరొకరికి పంపే నెట్ వర్క్ ఉంది. ఈ నెట్ వర్క్ ను వాడుకునే హ్యాకర్లు ఇంతటి భారీ మొత్తాన్ని దొంగిలించినట్టు సమాచారం.

అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ దీన్ని గుర్తించింది. కిమ్ గ్రూప్ అయిన 'లాజరస్' హ్యాకర్లపై ఆంక్షలు విధించింది. ఉత్తరకొరియా ప్రభుత్వం కోసం ఈ క్రిప్టోలను సంపాదించేందుకు ఈ గ్రూప్ పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ట్రెజరీ శాఖ ఈ గ్రూపు వినియోగించే వాలెట్ పై కూడా ఆంక్షలు విధించింది.

ఉత్తర కొరియా ఆధీనంలోని బృందాలు గత కొన్నేళ్లుగా హ్యాకింగ్ లతో అక్కడి ప్రభుత్వానికి అవసరమైన నిధులను సంపాదిస్తున్నాయి. ఈ సొమ్ముతో ఉత్తరకొరియా అణ్వాయుధాలు, క్షిపణులు తయారు చేస్తోందని ఐరాస పరిశోధన బృందాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లలోనే లాజరస్ గ్రూప్ ఒక్కటే 1.75 బిలియన్ డాలర్ల విలువైన సొమ్మును కాజేసినట్లు డిజిటల్ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ తెలిపింది.