Begin typing your search above and press return to search.

పవన్ తో అంత ఈజీ కాదా... ?

By:  Tupaki Desk   |   1 Jan 2022 12:30 PM GMT
పవన్ తో అంత ఈజీ కాదా... ?
X
పవన్ కళ్యాణ్. సినిమా నటుడు. ఆయనకేమి తెలుసు రాజకీయాలు అనే సీన్ నుంచి ఆయనే రాజకీయాలను టర్న్ చేయగలరు అన్న దాకా ఏపీ పాలిటిక్స్ వచ్చేశాయి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే 2024 ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగానే పనిచేస్తుంది అంటున్నారు. దానికి పూర్వ రంగం సిద్ధంగా ఉందని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలోని కాపులంతా ఏకమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాపులే సీఎం అభ్యర్ధి అని వారు చెబుతున్నారు. ఏపీలో వైసీపీని ఓడించాలంటే కాపులను ఒక బలమైన శక్తిగా గుర్తించాలని కూడా కోరుతున్నారు.

ఏపీలో టీడీపీ పరిస్థితి ఇపుడు ఇబ్బందికరంగా ఉంది. రాజకీయంగా చూస్తే ఆ పార్టీకి ఎంతో హిస్టరీ ఉండవచ్చు కానీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం మాత్రం ఆ పార్టీకి లేదు. దాంతో పొత్తులకు ఆ పార్టీ అర్రులు చాస్తోంది. మరి తెలిసి మాట్లాడుతున్నారా అధినేతకు చెప్పి మాట్లాడుతున్నారా అన్నది తెలియదు కానీ టీడీపీ నేతలు చాలా మంది జనసేనతో పొత్తు గురించి బాహాటంగా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.

లేటెస్ట్ గా శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ కూడా జనసేనతో పొత్తు ఉండాల్సిందే అని గట్టిగా చెప్పారు. దానికంటే ముందు గోదావరి జిల్లాలకే చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇదే మాట అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు వంటి వారు కూడా జనసేనతో సై అంటున్నారు.

ఇక్కడ చిత్రమేంటి అంటే ఈ రోజు వరకూ జనసేన నాయకులు ఎవరూ పెదవి విప్పడంలేదు. పొత్తు గురించి వారు ఎక్కడా మాట్లాడిందిలేదు. అంటే వారి బెట్టుగా బయటపడకుండా ఉన్నారన్న మాట. రేపటి వేళ అదే జనసేనకు ఆయుధంగా మారబోతోంది అంటున్నారు. పొత్తుల కోసం పరుగులు తీస్తున్నది అర్రులు చాస్తున్నది టీడీపీ అని ఏపీ రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదే సమయంలో జనసేంతో టీడీపీకి పొత్తు అవసరం. అదే పవన్ కళ్యాణ్ కి అంత లేదు అన్న మాట ఉంది.

ఆయనకు పొత్తు పార్టీగా బీజేపీ ఆల్ రెడీ ఉంది. ఇక ఆయనకు ఎకాఎకీన సీఎం కావాలన్న కోరిక కూడా లేదు. ఆయన రాజకీయంగా చూసుకుంటే యువకుడు. మరిన్ని ఎన్నికలను చూస్తారు. అదే చంద్రబాబు విషయం అలా కాదు, ఈసారి ఎన్నికలు బాబుకు దాదాపుగా చివరివి. అందువల్ల టీడీపీ బలహీనతలే ఇపుడు జనసేనకు వరంగా మారబోతున్నాయి అంటున్నారు.

ఈసారి పొత్తులు కనుక ఈ రెండు పార్టీల మధ్య కుదరాలీ అంటే జనసేన పెట్టే చాలా కండిషన్లు టీడీపీ ఒప్పుకోవాల్సిందే అంటున్నారు. జనసేనకు ఎక్కువ సీట్లు కావాలి. జనసేనకు కోరిన చోట్ల సీట్లు ఇవ్వాలి. జనసేనకు ప్రయారిటీ ఇవ్వాలి. మొత్తం 175 సీట్లలో జనసేన కచ్చితంగా 75 నుంచి ఎనభై సీట్లను ఈసారి డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. నో అనే సీన్ అయితే టీడీపీకి లేదు కాబట్టి ఈసారి పవన్ దే పై చేయి అంటున్నారు. మొత్తానికి పవన్ తో ఈజీగా పొత్తులు ఉంటాయని కనుక టీడీపీ అధినాయకత్వం అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదని చెబుతున్నారు. కానీ టీడీపీకి ఇది అనివార్యం అయితే కనుక కచ్చితంగా ఎన్నికల కంటే ముందే పొత్తుల ఎత్తులతోనే పవన్ గెలిచేసినట్లుగా చెప్పుకోవాలి మరి.