Begin typing your search above and press return to search.

ఈ స్కూల్ మాదిరి ప్ర‌చారం చేసే ద‌మ్ము చంద్రుళ్ల‌కుందా?

By:  Tupaki Desk   |   27 May 2018 8:39 AM GMT
ఈ స్కూల్ మాదిరి ప్ర‌చారం చేసే ద‌మ్ము చంద్రుళ్ల‌కుందా?
X
బ‌స్తీ మే స‌వాల్ అంటే గింటే ఇలానే ఉండాలి. వేలాది రూపాయిలు ఫీజులు దోచేస్తూ.. నాణ్య‌మైన విద్య స్థానే ఎలాంటి చ‌దువుల్ని కార్పొరేట్ స్కూల్ కంపెనీలు చెబుతాయో తెలుగు నేల మీద పుట్టిన ఏ తెలుగోడికి ప్ర‌త్యేకంగా చెప్పొచ్చు. కార్పొరేట్ స్కూళ్ల‌కు.. కాలేజీల‌కు వంత పాడేలా.. వాటిని ప్రోత్స‌హించేలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు పోటీ ప‌డుతున్న వేళ‌.. గ‌వ‌ర్న‌మెంట్ ఈ స్కూళ్ల‌ల్లో పోటుగాళ్లు లాంటి ఉపాధ్యాయులు ఉన్నా.. ఎందుకు ప‌నికిమాలిన రీతిలో ఉండే ప‌రిస్థితి.

ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల‌తో ఏటా వేలాది కోట్లు ఖ‌ర్చు పెట్టే ప్ర‌భుత్వాలు.. తాము న‌డిపే స‌ర్కారీ బ‌ళ్ల‌ను.. అలంకార ప్రాయంగా న‌డ‌ప‌ట‌మే కానీ.. వాటిని ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం న‌డిపిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. ఈ కార‌ణంతోనే పేదోళ్లు సైతం ఏదోలా అప్పు చేసి త‌మ పిల్ల‌ల్ని ప్రైవేటు స్కూళ్లు.. కాలేజీల‌కు పంపే ప‌రిస్థితి. ఇక‌.. అధికారులు.. వ్యాపారులు.. సంప‌న్నులు.. రాజ‌కీయ నేత‌లు ఇలా చెప్పుకుంటూ పోతే స‌మాజంలోని ఏ వ‌ర్గం కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు.. కాలేజీల‌కు త‌మ పిల్ల‌ల్ని పంపేందుకు సుతారం ఇష్ట‌ప‌డ‌రు.

వేలాది కోట్లు ఖ‌ర్చు పెడుతున్నా వాటి ప‌నితీరు ఎందుకు స‌రిగా ఉండ‌దంటే.. రాజ‌కీయ కోణ‌మే. విద్య‌ను వ్యాపారం చేసేసి.. దాన్నో కంపెనీ మాదిరి మార్చేసిన వ్యాపారుల‌కు కొమ్ము కాసేలా ప్ర‌భుత్వాలు ఉండ‌ట‌మేన‌ని చెబుతారు. ఈ విమ‌ర్శ‌కు త‌గ్గ‌ట్లే.. కేజీ నుంచి పీజీ వ‌ర‌కూ ఫ్రీ చ‌దువు అని చెప్పిన కేసీఆర్ స‌ర్కారు సైతం.. త‌మ నాలుగేళ్ల పాల‌న‌లో ఏం చేసింది లేదు.

ఇలాంటి వేళ‌.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఎంత మొన‌గాళ్లు అన్న విష‌యాన్ని అంద‌రికి చాటి చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన కాజ‌లూరు గ్రామంలోని ఒక ప్ర‌భుత్వ పాఠ‌శాల ప్ర‌య‌త్నం చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌.. నైతిక విలువ‌లు.. స‌రైన శిక్ష‌ణకు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు మించింది మ‌రొక‌టి లేవ‌ని చెబుతూ వినూత్నంగా ప్ర‌చారం చేస్తున్నారు.

స్కూల్ ఆడ్మిష‌న్ల‌ను మామూలుగా కాకుండా రోటీన్ కు భిన్నంగా నిర్వ‌హిస్తున్నారు. కాజ‌లూరు శ్రీ‌రామ్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఆడ్మిష‌న్లు షురూ అయ్యాయ‌ని చెబుతూ.. ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇప్పుడా ఫ్లెక్సీ తెగ ఆక‌ర్షిస్తోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల రిలీజ్ అయి.. భారీ స‌క్సెస్ అందుకున్న రంగ‌స్థ‌లం సినిమాలోని హిట్ సాంగ్ అయిన పాట‌ను పేర‌డీగా మార్చి త‌మ‌కు త‌గ్గ‌ట్లు మార్చేసుకున్నారు.

ఇది ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆ గ‌ట్టునుంటావా? విద్యార్థి ఈ గ‌ట్టున ఉంటావా? అంటూ పాట‌తో ప్ర‌చారం చేస్తున్న ఈ స్కూల్‌.. ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రైవేటు స్కూళ్ల‌ల్లో చ‌దువు చెప్పేందుకు ఎంత భారీగా ఖ‌ర్చు పెట్టిస్తారో వివ‌రంగా పేర్కొన్నారు. స్కూల్ ఫీజు 5వేలు.. స్కూల్ బ్యాగ్ రూ.500.. పుస్త‌కాలు రూ.1500.. లంచ్ బాక్స్ రూ.5వేలు.. యూనిఫాం 1000.. బ‌స్సు లేదా ఆటోల‌కు రూ.2వేల అంటూ ఇలాఖ‌ర్చుల లిస్ట్ ను పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో ప్రభుత్వ స్కూళ్ల‌లో ఎలాంటి చార్జీలు వ‌సూలు చేయ‌ర‌ని.. అన్ని ఉచితమ‌ని గుర్తు చేస్తూ.. త‌మ స్కూళ్ల‌ల్లో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తామ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీ ప్ర‌య‌త్నం స‌క్సెస్ కావ‌ట‌మే కాదు.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

నిత్యం పెద్ద పెద్ద మాట‌లు చెప్పే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇప్ప‌టికైనా కాజ‌లూరు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను స్ఫూర్తిగా తీసుకొని త‌మ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్ని బ‌లోపేతం చేయ‌టం మీద దృష్టి పెడితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. ఆ ద‌మ్ము ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు ఉందా?