Begin typing your search above and press return to search.

చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా..

By:  Tupaki Desk   |   12 Dec 2021 5:00 AM IST
చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా..
X
భారత్ నైనా నమ్ముతుందో లేదో కాని.. పాకిస్ధాన్ ను మాత్రం నమ్ముతుంది అమెరికా. దక్షిణాసియాలో అవసరాల రీత్యా కానీ.. వ్యూహాత్మక ప్రాధాన్యత రీత్యా కానీ.. పాక్ అంటే అమెరికాకు ఇష్టమే. ఉగ్రవాదాన్ని ఎంత ప్రోత్సహించినా.. 2001 కి ముందు పాకిస్థాన్ పై నేరుగా చర్యలు తీసుకున్నది లేదు. అయితే, 2001 అమెరికాపైనే నేరుగా ఉగ్రవాదులు దాడికి దిగడంతో పరిస్థితిలో మార్పు మొదలైంది. ఆ సమయంలో భారత్ సైతం పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి తదితర ఘటనలను ఎదుర్కొంది.

దీంతో భారత్-అమెరికా క్రమంగా దగ్గరవడం మొదలైంది. పాకిస్థాన్.. చైనాను అశ్రయించడం మొదలుపెట్టింది. అంతమాత్రాన పాక్-అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పలేం. డొనాల్డ్ ట్రంప్ నకు ముందు వరకు భారత్ వచ్చిన అమెరికా ప్రతి అధ్యక్షుడు తిరుగు ప్రయాణంలో పాక్ ను సందర్శించేవారు. అయితే, పరిస్థితి ఇప్పుడు మారిపోయినట్లు కనిపిస్తోంది.

తాజాగా జరిగిన ప్రజాస్వామ్య సదస్సుకు అమెరికా పిలిచినా పాక్ గైర్హాజరయింది. దీనికి అమెరికాపై కోపంతో పాటు చైనాపై ప్రేమ కూడా కారణమని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించి ఏడాది అవుతున్నా.. జో బైడెన్ ఇంతవరకు తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఒక్క ఫోన్ కాల్ అయినా చేయలేదనేది పాకిస్థాన్ ఎప్పటినుంచో వాపోతోంది. పాక్ జాతీయ సలహాదారు మోయిద్ యూసుఫ్ కూడా దీనిఫై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అమెరికా ఏమాత్రం లొంగలేదు.

ఆ సదస్సుకు ఆహ్వానించినా..

ఈ క్రమంలో డిసెంబరు 9,10 తేదీల్లో జరిగే ప్రజాస్వామ్య సదస్సుకు హాజరవాలని పాక్ ను గత నెలలో అమెరికా ఆహ్వానించడంతో ఇరుదేశాల మధ్య ఉన్న పొరపొచ్చాలు కాస్త తగ్గిపోతాయేమో అనిపించింది. వర్చువల్ గా జరిగిన ఆ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయ. కానీ, పాక్ ఇందులో పాల్గొనలేదు. దక్షిణాసియా నుంచి భారత్, మాల్దీవులు, నేపాల్ దేశాలకు ఈ సదస్సుకు హాజరుకావాలని పిలుపు రాగా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు ఆహ్వానం అందలేదు. మరోవైపు బైడెన్ ప్రభుత్వం ఈ సదస్సుకు 110 దేశాలను ఆహ్వానించింది.

కానీ చైనా, రష్యా, టర్కీలను పక్కనబెట్టిన అమెరికా సర్కారు తైవాన్‌కు ఆహ్వానం పంపింది. తైవాన్‌ను పిలవడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా కారణంగానే ఈ సదస్సుకు హాజరుకాకూడదని పాక్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

అంతంత మాత్రం సంబంధాలతో..

అసలే అమెరికాతో సంబంధాలు చెడిన నేపథ్యంలో, పాక్ తాజా వైఖరి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలహీనం చేస్తుందని అంటున్నారు. గంటల తరబడి సంప్రదింపులు జరిపిన తర్వాత తాము ఈ సదస్సులో పాల్గొనడం లేదని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. జో బైడెన్‌తో మాట్లాడేందుకు తమ కేబినెట్‌లోని ఒక మంత్రిని పంపిస్తామని తొలుత చెప్పుకొచ్చింది. కానీ చివరకు సదస్సులో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ''అమెరికాతో మా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది.

రెండు దేశాల మధ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు విస్తరిస్తాయని మేం ఆశిస్తున్నాం. ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు సంబంధించిన అంశాల పరంగా మేం అమెరికాతో సంప్రదింపులు జరుపుతాం. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎదురు చూస్తాం'' అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

అసలైన సోదరుడు పాక్ : చైనా

పాకిస్తాన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ట్వీట్ చేశారు. ''ప్రజాస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. అసలైన, బలమైన సోదరుడు'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. సదస్సుకు పాకిస్తాన్ గైర్హాజరు కావడం చైనాకు సంతోషాన్ని కలిగించినట్లు ఆయన చేసిన ట్వీట్‌తో అర్థం అవుతోంది.

''ఈ సదస్సుకు చైనాను ఆహ్వానించకపోవడానికి చాలా పెద్ద కారణం ఉంది. అమెరికాతో పటిష్ట అనుబంధం లేని కారణంగా సదస్సుకు దూరంగా ఉండాలని ఇస్లామాబాద్ నిర్ణయించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, పాకిస్తాన్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కూడా ఓ కారణం ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బైడెన్ ఇప్పటివరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడలేదు. కానీ తాజా ఆహ్వానం ఇరుదేశాల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నంలా కనిపించింది'' అని పాకిస్తాన్ ఆంగ్ల వార్తాపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

దీనివెనుక చైనా హస్తం ఉందా?

''పాకిస్తాన్ నిర్ణయం వెనుక చైనా హస్తం ఉందా? లేదా? అన్న సంగతి ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఈ విషయం గురించి చైనాను పాక్ సంప్రదించినట్లుగా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్ నిరాకరించడం చూస్తే, అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది.

ప్రజాస్వామ్యం, మానవహక్కులు ఆధారంగా అమెరికా తమపై ఆంక్షలు కూడా విధిస్తుందేమో అని పాకిస్తాన్ భయపడుతోంది'' అని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ రాసుకొచ్చింది. పాకిస్థాన్ నిర్ణయంపై దౌత్యవేత్తలు, పాత్రికేయులు స్పందించారు. ''డెమోక్రసీ సమ్మిట్‌కు పాక్ గైర్హాజరు కావడం సమతుల్యమైన, జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయంలాగే అనిపిస్తోంది'' అని భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ట్వీట్ చేశారు.

దీన్ని రీట్వీట్ చేసిన పాకిస్తాన్ జర్నలిస్ట్ కమ్రాన్ యూసుఫ్ ''అనాలోచితం. మనల్ని మనమే ఒక మూలకు నెట్టుకుంటున్నట్లుగా ఉంది'' అని వ్యాఖ్యానించారు. కమ్రాన్ యూసుఫ్ ట్వీట్‌కు బాసిత్ బదులిచ్చారు.

''పాకిస్తాన్-అమెరికా మధ్య సంబంధాలు ఎప్పుడో ఒక మూలకు పడ్డాయి. అంతర్జాతీయ సంబంధాలు నెరపడం అనేది ఒక ప్రక్రియ, అంతేగానీ ఒక కార్యక్రమం కాదు. మనకు మనమే మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోలేం. యథార్థ విషయాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయం ఇది. మేమేం చేస్తున్నామో మాకు తెలుసు'' అని ఆయన ట్వీట్ చేశారు. దీని గురించి అబ్దుల్ బాసిత్ యూట్యూబ్‌లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. సదస్సుకు హాజరుకాకూడదనే నిర్ణయాన్ని ఆయన ఆ వీడియోలో సమర్థించారు. ''డెమోక్రసీ సమ్మిట్‌ను చూస్తే, అది చైనా వ్యతిరేక ప్రచార కార్యక్రమంలా అనిపిస్తోంది. సదస్సుకు ఆహ్వానించిన వారి పరంగా చూసినా, పిలుపు అందని వారి వైపు నుంచి గమనించినా అది అలాగే కనిపిస్తోంది'' అని అన్నారు.

''చైనా, రష్యాను ఆహ్వానించలేదు. కానీ బంగ్లాదేశ్, టర్కీలను ఆహ్వానించి ఉండాల్సింది. ప్రజాస్వామ్యం అంటే పాశ్చాత్య ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేంటంటే సదస్సుకు తైవాన్‌ను కూడా పిలిచారు. 'వన్ చైనా పాలసీ'కి అంగీకరించిన తర్వాత కూడా ఇక్కడ తైవాన్‌ను అమెరికా ఆహ్వానించింది. తైవాన్ ఉండి, చైనా లేని ఆ సమావేశానికి పాకిస్తాన్ వెళ్లాలని ఎలా ఆశిస్తాం? చైనా, పాకిస్తాన్ మధ్య సంబంధాలను చెడగొట్టాలనే ఉద్దేశంతోనే అమెరికా మమ్మల్ని ఆహ్వానించినట్లు అనిపిస్తోంది. అందుకే మేం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది'' అని ఆయన వివరించారు.

''సదస్సుకు హాజరు కాకపోతే అమెరికాతో పాక్ సంబంధాలు చెడిపోతాయని అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలేమీ లేవు. ఒక కార్యక్రమానికి హాజరైనంత మాత్రానా, ఒక రోజులో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడవు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమెరికా ఈ సదస్సును నిర్వహిస్తోంది. దీనికన్నా ముందు వాతావరణ సదస్సు జరిగింది. దానికి పాకిస్తాన్‌ను ఆహ్వానించలేదు. కానీ డెమోక్రసీ సమ్మిట్ ద్వారా మాకు వల విసరాలని అమెరికా ప్రయత్నించింది. కానీ మేం సరైన నిర్ణయం తీసుకున్నాం.

ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండబోదని మేం ఇప్పుడు నమ్ముతున్నాం'' అని ఆయన చెప్పారు. ఈ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, గురువారం 'ఇస్లామాబాద్ సమావేశం-2021'లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. ''అమెరికా-చైనాల మధ్య జరుగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధంలో పాకిస్తాన్, ఎవరి పక్షం కూడా తీసుకోవాలని అనుకోవట్లేదు. కానీ ఆ రెండు దేశాల మధ్య శాంతి ఏర్పడాలని కోరుకుంటోంది'' అని వ్యాఖ్యానించారు.