Begin typing your search above and press return to search.

నిజాంపై పోలీసు చర్య వేళ.. ఢిల్లీపై బాంబులు వేసేలా పాక్ ప్లాన్? మరేం జరిగింది?

By:  Tupaki Desk   |   17 Sep 2022 8:30 AM GMT
నిజాంపై పోలీసు చర్య వేళ.. ఢిల్లీపై బాంబులు వేసేలా పాక్ ప్లాన్? మరేం జరిగింది?
X
దేశానికి స్వాతంత్య్ం వచ్చి ఈ ఆగస్టు 15 నాటికి 75ఏళ్లు అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు (ఆ మాటకు వస్తే కర్ణాటకలోని కొంత భాగానికి.. మహారాష్ట్రలోని మరికొంత భాగానికి) స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు మాత్రమే అయినట్లు.ల లెక్కగా చూస్తే అలా ఉంటుంది కానీ.. భారత్ లో అంతర్భాగమైన నాటి హైదరాబాద్ స్టేట్ .. అందులోని ప్రజలకు భారత స్వాతంత్య్ర దినోత్సవమే స్వాతంత్ర్య దినోత్సవమైంది. పంద్రాగస్టున దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. నాటి నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ స్టేట్ కు మాత్రం మిగిలిన దేశ ప్రజలకు మాదిరి స్వాతంత్య్ం ఆగస్టు 14 అర్థరాత్రి కాకుండా.. 1948 సెప్టెంబరు 17న వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ 74 ఏళ్లలో ఎప్పుడూ కూడా సెప్టెంబరు 17 గురించి ఇంతటి చర్చ జరిగింది లేదు.

తెలంగాణ మీద బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేయటం.. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మోడీషాలు పావులు కదుపుతున్న వేళ.. సెప్టెంబరు 17ను ప్రత్యేక దినంగా.. దానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాల్ని చేపట్టటం.. దానికి కౌంటర్ గా సీఎం కేసీఆర్ సైతం అంతే భారీగా వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా ప్లాన్ చేయటంతో.. అసలు సెప్టెంబరు 17, 1948లో ఏం జరిగింది? అన్నదిప్పడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అప్పుడెప్పుడో 74 ఏళ్ల క్రితం జరిగిన పలు విషయాల మీద ఇప్పుడు అందరూ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో.. ఇటీవల కాలంలో ఎప్పుడూ తెర మీదకు రాని.. చర్చకురాని చాలానే అంశాలుఇప్పుడు వస్తుండటం గమనార్హం. సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం మీద భారత ప్రభుత్వం పోలీస్ చర్య చేపట్టే వేళలో పాకిస్థాన్ ఏం చేసింది? ఎలాంటి కుట్రలకు ప్లాన్ చేసిందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

పటేల్ నాయకత్వంలోజరిగిన పోలీసు చర్యకు పాక్ పెద్దగా రియాక్టు కానట్లుగా కనిపిస్తుంది. కానీ.. ఆదేశం అప్పట్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా మౌనంగా ఉన్నట్లు కనిపించినా.. లోలోన మాత్రంభారీగా ఉడికిపోయి.. దారుణమైన ప్లాన్లు వేసినప్పటికీ ఆచరణ సాధ్యం కాక ఊరకుండిపోయినట్లుగా చెబుతారు. హైదరాబాద్ పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో ప్రముఖంగా చర్చించిన అంశం.. 'హైదరాబాద్ లో ఉన్న భారత సైన్యంపై పాకిస్థాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయా?' అనే అంశంపైనే. దీనిపై ఆయన సైన్యాన్ని ప్రశ్నించగా.. అప్పటి పాక్ సైన్యంలో కెప్టెన్ గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్ లో పాకిస్థాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే ఛాన్సులు లేవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖాత్ అలీఖాన్ మరో ప్రశ్నను సంధించగా..

దానికి ఎలవర్దీ సమాధానమిస్తూ.. ప్రస్తుతం తమ వద్ద నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పని చేయటం లేదని చెప్పారు. తమ వద్ద ఉన్న రెండు యుద్ధ విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అది తిరిగి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవటమే మంచిదన్న విషయాన్ని అర్థం చేసుకొని.. మరేమీ చేయలేక మౌనంగా ఉండిపోయిన పరిస్థితి.అందుకే.. హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య వేళలో.. పాక్ మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.