Begin typing your search above and press return to search.

పవన్‌... అంతా వ్యూహాత్మకమేనా?

By:  Tupaki Desk   |   18 Oct 2022 12:30 PM GMT
పవన్‌... అంతా వ్యూహాత్మకమేనా?
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉగ్రరూపం దాల్చారు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఒరేయ్‌ దద్దమ్మల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, వెధవల్లారా, వైసీపీ గూండాగాళ్లారా ఇంకోసారి ప్యాకేజీ అంటే చెప్పుతీసుకుని దవడ పళ్లు రాలగొడతా అంటూ ఉద్రేకంతో ఊగిపోయారు. ఇంకోసారి ప్యాకేజీ అని కూస్తే చెప్పు తెగుతుంది అంటూ తన కాలి చెప్పు తీసి చూపించారు.

వైసీపీ దగ్గర గూండాలున్నారా.. క్రిమినల్స్‌ ఉన్నారా.. రౌడీలు ఉన్నారా.. ఒక్కడినే వస్తా.. గొంతు పిసికి కింద పాతేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనకు భాష రాదనుకుంటున్నారా అని మండిపడ్డారు.

అయితే నిన్నటి వరకు ఎంతో సంయమనంతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ వ్యూహాత్మకంగానే ఇలా నిప్పులు చెరిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి పవన్‌ ఇంతే దూకుడుగా ఉండి ఉంటే బాగుండేదని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.

మొదటి నుంచీ వైసీపీ రెండు విషయాలనే టార్గెట్‌ చేస్తూ వస్తోంది. ఒకటి పవన్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని.. రెండు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని అమ్ముడుపోయారని. వీటిపైనే వైసీపీ రాజకీయం చేస్తూ వచ్చింది.

అయితే ఆ విమర్శలను పవన్‌ మొదట్లో లైట్‌ తీసుకున్నారు. పవన్‌ నుంచి, జనసేన నేతల నుంచి ఈ విషయాల్లో గట్టి కౌంటర్లు లేకపోవడంతో ప్రజల్లో ఒక వర్గం కూడా పవన్‌ ప్యాకేజీ నిజమే అని నమ్మిన భావన ఏర్పడిందని అంటున్నారు.

ఈ ప్రభావం గత ఎన్నికల సమయంలో పవన్‌ కల్యాణ్‌పై, ఆయన పార్టీపై గట్టిగానే పడింది. ఒకే ఒక్క స్థానంలో రాజోలులో మాత్రమే పార్టీ గెలవగలిగింది. మొదట్లోనే మూడు పెళ్లిళ్లు విషయంలో తనపై విమర్శలు చేసినప్పుడే ప్రశ్నించి ఉంటే వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట పడేదని అంటున్నారు.

అలాగే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు వంటి వైసీపీ నేతలు మహిళలతో అసభ్యంగా ఫోన్లలో మాట్లాడుతూ దొరికిపోయారు. ఈ విషయాలను జనసేన పార్టీ మొదట్లో లైట్‌ తీసుకుంది. చివరకు ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ వ్యవహారంలో జనసేన పార్టీ నుంచి అసలు స్పందనే కరువైంది. వీటిని రాజకీయంగా వాడుకోవాల్సిన జనసేన పార్టీ అడ్రస్‌ లేకుండా పోవడంపై సొంత పార్టీలోనే కొంతమంది పెదవి విరిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక జగన్‌ అవినీతిని బలంగా మొదటి నుంచి చెప్పలేకపోయారు. 2004 ఎన్నికల ముందు డబ్బులు లేక వైఎస్సార్‌ హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు వైఎస్‌ జగన్‌కు వేల కోట్ల రూపాయలు విలువ చేసే పత్రిక, టీవీ, సిమెంటు ఫ్యాక్టరీలు, ఇతర ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేదానిపై జనసేనాని గట్టిగా ప్రశ్నించలేదు. సైద్దాంతికంగానే విమర్శిస్తాం.. మీరు బూతులు తిట్టినా మేం తిట్టం.. మీరు మా మహిళలను తిట్టినా.. మీ మహిళలను మేం తిట్టబోం అంటూనే పవన్‌ మొదటి నుంచి సంయమనం పాటిస్తూ వచ్చారు.

దూకుడైన రాజకీయం చేయకుండా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించండన్నట్టు పవన్‌ రాజకీయాలు సాగాయి. అయితే దీనిపై జనసేన కార్యకర్తల్లోనూ, పవన్‌ అభిమానుల్లోనూ అసంతృప్తి ఉందని చెబుతున్నారు.

వాళ్లు తిడితే మనం తిడదాం.. కొడితే కొడదామని జనసేన పార్టీ శ్రేణులు గట్టిగా కోరుకున్నాయి. అయితే ఈ విషయంలో మనకు వ్యక్తిగత శత్రువులు ఎవరూ లేరు.. సైద్ధాంతిక శత్రువులే ఉన్నారంటూ పవన్‌ వారిని వారిస్తూ వచ్చారు.

అయితే వైసీపీ నేతలు రానురాను శ్రుతిమించిపోవడం, చివరకు పోసాని కృష్ణమురళిలాంటివారు కూడా పవన్‌తోపాటు ఆయన సతీమణిని, పసి పిల్లలను కూడా బూతులు తిట్టడం జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం పోలీసులను పెట్టి అడ్డుకోవడం, తనను ర్యాలీ చేయనీయకుండా, తనను ఎవరూ కలవనీయకుండా చేయడం, తన అభిమానులు, జనసేన శ్రేణులపై లాఠీచార్జ్‌ చేయడం, వందమందికి పైగా జనసేన నేతలను విశాఖ నోవాటెల్‌లో అర్ధరాత్రి పోలీసులు ప్రవేశించి అరెస్టులు చేయడం, విశాఖ వదిలివెళ్లాలని తనకు నోటీసులు జారీ చేయడం తదితరాలపై పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఓ రేంజులో ఏకిపడేశారు.

మరోవైపు ఈ వ్యవహారంలో కమ్యూనిస్టు పార్టీలు, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీల నేతలు పవన్‌ కల్యాణ్‌కే తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు వైసీపీ నేతల బూతులపై టీడీపీ నేతలు సైతం ఆగ్రహంగా ఉన్నారు. లోకేష్‌ పుట్టుకను అవమానించేలా శాసనసభ సాక్షిగానే వైసీపీ నేతలు కారుకూతలు కూయడం విమర్శలపాలైంది. మొన్న విశాఖలో మంత్రులపై దాడి చేశారంటూ చెబుతున్న వ్యవహారం టీడీపీ హార్డ్‌ కోర్‌ అభిమానులకు కూడా సంతోషాన్నిచ్చింది. తాము చేయలేని పని జనసేన నేతలు చేశారనే ఫీలింగ్‌ వారిలో వ్యక్తమైందని అంటున్నారు.

టీడీపీకి పూర్తి మద్దతుగా నిలిచే సామాజికవర్గంలోనూ పవన్‌ కల్యాణ్‌పై మొన్నటి ఘటనతో మద్దతు, సానుభూతి వ్యక్తమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల కేసులతో జావగారిపోయిన తన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధైర్యం నూరిపోయడం, భరోసా కల్పించడమే లక్ష్యంగా సీపీ నేతలపై పవన్‌ వ్యూహం మార్చారని అంటున్నారు.

అలాగే జగన్‌ ప్రభుత్వం దాష్టీకాలను ఎదిరించలేమని బాధపడుతున్న వివిధ పార్టీలు, సంఘాలు, వర్గాలు, కులాలకు కూడా పవన్‌ కల్యాణ్‌ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారని అంటున్నారు. జగన్‌ను ఎదిరించగల దమ్ము, ధైర్యం పవన్‌కే ఉన్నాయని వారంతా భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా జగన్‌ అంటే గిట్టని అందరి మద్దతును తన వైపుకు తిప్పుకోవడంలో భాగంగానే జనసేనాని విమర్శల డోసు పెంచారని అంటున్నారు.