Begin typing your search above and press return to search.

పెరటిచెట్టును వదిలి పుల్లకూరను నమ్మిన బాబుకు తప్పదు

By:  Tupaki Desk   |   27 Jun 2021 2:30 AM GMT
పెరటిచెట్టును వదిలి పుల్లకూరను నమ్మిన బాబుకు తప్పదు
X
తెలుగుదేశం అధినేత.. ఏపీ విపక్ష నేతకు సిత్రమైన అలవాటు ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఎవరూ కనిపించరు. గుప్పెడు మందిని చుట్టూ పెట్టుకొని వారితో వ్యవహారాలన్ని చూసేస్తారు. పవర్ చేజారి.. ప్రతిపక్ష కుర్చీలో కూర్చున్నంతనే అప్పటివరకు బాబు చుట్టూ ఉన్న వారు గాయబ్ అవుతారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి గుర్తింపు పొందని వారే.. చివరకు పార్టీకి అండగా మారతారు. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా సరే.. పవర్ రాగానే తెలియని మత్తు బాబు కళ్లను కమ్మేస్తుందన్న విమర్శ ఉంది.

2014 ఎన్నికల్లో మూడు పార్టీలతో కలిసి పోటీ చేసిన పుణ్యమా అని పవర్లోకి వచ్చిన చంద్రబాబు చుట్టూ.. నారాయణ.. సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లాంటి వారు కనిపించేవారు. కట్ చేస్తే.. .2019 ఎన్నికల తర్వాత దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత బాబు చుట్టూ ఉన్న వారు ఏదో కారణం చెప్పి గాయబ్ అయిపోయినోళ్లే. ఇలా బాబు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే.. ఆయనకు వీర విధేయుడిగా ఉన్న నేతలు పెద్దగా కనిపించరు. ఇలాంటి పరిస్థితే.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించింది. ఇంటి చెట్టు వైద్యానికి పనికి రాదన్న సూత్రాన్ని బాబు పక్కాగా పాటిస్తారని చెప్పాలి.

అదే సమయంలో పొరుగింటి పుల్లకూరను బాబు బాగా ఇష్టపడతారని చెబుతారు. దీనికి తగ్గట్లే 2014లో విజయం సాధించిన తర్వాత ఉన్న ఎమ్మెల్యేలు సరిపోరన్నట్లుగా.. ప్రత్యర్థి పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తీసుకొచ్చి పెద్ద పీట వేశారు. మంత్రి పదవులు ఇచ్చారు. అంతేకానీ.. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి గొంతుకలా నిలిచిన ఎంతోమందిని మంత్రివర్గంలో తీసుకున్నది లేదు. దీనికి ఉదాహరణగా ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవులు.. ఇలా పలువురు ఉన్నారు.

నిజానికి 2009లో విపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి అండగా నిలిచిన వారికి బాబు అవకాశం ఇవ్వకపోటాన్ని పలువురు తప్పు పట్టారు. అయినా.. ఆయన పట్టించుకోలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోయారు. ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారే తప్పించి.. మంత్రి పదవిని ఇవ్వలేదు. అనూహ్యంగా 2019లో జరిగిన ఎన్నికల్లో పయ్యావుల విజయం సాధించారు. కానీ.. పార్టీ మాత్రం ఓటమిపాలైంది. ఇక్కడో సెంటిమెంట్ ను చెబుతారు. ఉరవకొండలో విజయం సాధించిన పార్టీ విపక్షంలో ఉంటుందని చెబుతారు.

మంచి వాగ్దాటితో పాటు.. పదునైన మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే పయ్యావుల.. తన సహజ శైలికి భిన్నంగా ఈసారి మౌనంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. 2014లో పార్టీ విజయం సాధించిన వేళ.. అధినేత చంద్రబాబు తనను పట్టించుకోకపోవటం.. తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఆయన్ను బాధించిందని చెబుతారు. అందుకే.. ఈసారి పార్టీ ఓడిన వేళ.. ఆయన తనకు భిన్నమైన శైలిలో కామ్ గా ఉండటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. పీఏసీ ఛైర్మన్ గా చంద్రబాబు అవకాశం ఇచ్చినా తీసుకోవటానికి ముందుకు రాలేదు.

తన మీద అమరావతి భూ ఆరోపణలు వచ్చినప్పటికి ఘాటుగా బదులు ఇవ్వకుండా మెత్తగా సమాధానం ఇచ్చారే తప్పించి హడావుడి చేయలేదు. అనంతరం వైసీపీ పాలన మీద ఆయన విమర్శలు చేసింది లేదు. అచ్చెన్నాయుడు అరెస్టు వేళలోనూ.. ఆ తర్వాత తన మిత్రుడైన ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసిన సందర్భంలోనూ ఆయన స్పందించలేదు. కాకుంటే.. బెయిల్ మీద విడుదలైన తర్వాత మాత్రం నరేంద్ర నివాసానికి వెళ్లి మాత్రం పరామర్శించి వచ్చారే తప్పించి మీడియా ముందుకు వచ్చింది లేదు.

ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు ఎవరూ పయ్యావులకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఆ మాటకు వస్తే ఆయన్ను టార్గెట్ చేయాలన్న ఆలోచనే లేదన్నట్లుగా ఉండటం గమనార్హం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వైసీపీ అధినాయకత్వానికి పయ్యావుల దగ్గరయ్యారని.. ఈ కారణం చేతనే ఆయన కామ్ గా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా కూడా మనసు పెట్టి పని చేసినట్లుగా పయ్యావుల కనిపించలేదు. చేశామంటే చేశామన్నట్లుగా ఆయన తీరు ఉందంటున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశం ఉందంటున్నారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న సామెతకు తగ్గట్లు బాబు తీరు ఉండటం.. పొరుగింటి పుల్లకూరను ఇష్టపడిన నేపథ్యంలో బాబుతో కలిసి సాగాలన్న ఆలోచనలో పలువురు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా లేరంటున్నారు. సరైన సమయంలో వారంతా వెళ్లిపోవటం ఖాయమంటున్నారు. శ్రావణ మాసంలో పయ్యావుల సైతం పార్టీ మారే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.