Begin typing your search above and press return to search.

పెట్రోల్ దాదాపు 8 నుంచి 9 రూపాయాలు పెరుగుతున్నాయా?

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:15 AM GMT
పెట్రోల్ దాదాపు 8 నుంచి 9 రూపాయాలు పెరుగుతున్నాయా?
X
వాహ‌న‌దారుల‌కు ఇంధ‌న సెగ భారీగానే త‌గ‌ల‌బోతుందా? పెట్రోల్ ధ‌ర భారీగా పెర‌గ‌నుందా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. దాదాపు మూడు నెల‌లుగా పెద్ద‌గా మార్పుల్లేని ఇంధ‌న ధ‌ర‌ల్లో మార్చి 10 త‌ర్వాత అనూహ్య పెంపు ఉండ‌బోతుంద‌ని తెలిసింది.

పెట్రోల్ ధ‌ర లీట‌ర్‌కు దాదాపు 8 నుంచి 9 రూపాయాల వ‌ర‌కూ పెర‌గొచ్చ‌నే సంగ‌తి వాహ‌న‌దారుల గుండెకు మంట పెడుతోంది. ఈ షాకింగ్ విష‌యాల‌ను డెలాయిట్ నివేదిక వెల్ల‌డించింది.

ఎన్నిక‌లు ముగియ‌గానే..

పెట్రోల్ ధ‌ర ఇప్ప‌టికే సెంచ‌రీ కొట్టింది. అడ్డూఅదుపూ లేకుండా కంపెనీలు చ‌మురు ధ‌ర‌లు పెంచుకుంటూ పోయాయి. కానీ మూడు నెల‌లుగా మాత్రం వాటి ధ‌ర‌ల్లో పెద్ద‌గా మార్పు ఉండ‌డం లేదు. అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర పెరిగినా కానీ దేశంలో మాత్రం ఎలాంటి పెంపు లేదు. అందుకు కార‌ణం అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లే. నేటితో పోలింగ్ ప్ర‌క్రియ మొద‌లు కానుంది. మార్చి 10తో అది ముగుస్తుంది. ఆ వెంట‌నే వాత పెట్టేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని డెలాయిట్ పేర్కొంది. అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లు పూర్తి కాగానే మోత మొద‌ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఆ లోటు తీర్చేలా..

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధ‌ర పెరుగుతోంది. అయినా అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార పార్టీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచ‌లేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఎన్నిక‌లు ముగిశాక ఆ లోటును మొత్తం పూడ్చుకునేలా ఏకంగా పెట్రోల్ లీట‌ర్‌కు 8 నుంచి 9 రూపాయాల వ‌ర‌కూ పెంచే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. గ‌తేడాది దీపావ‌ళికి ముందు చ‌మురు కంపెనీలు ఇంధ‌న ధ‌ర‌ల‌ను క్ర‌మంగా పెంచుకుంటూ పోయాయి.

దానిపై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ వ్య‌తిరేక‌త అర్థం చేసుకోవ‌డంతో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్రం ఇంధ‌న ధ‌ర‌ల‌పై ఎక్సైజ్ డ్యూటీని త‌గ్గించింది.

అది కూడా పెట్రోల్‌పై రూ.5, డిజీల్‌పై రూ.10 చొప్పున త‌గ్గించింది. రాష్ట్రాల‌ను కూడా కాస్త త‌గ్గించాల‌ని కోరింది. కానీ కొండంత పెంచి పిస‌రంత త‌గ్గించిన కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించిన తెలంగాణ లాంటి రాష్ట్రాలు అందుకు ఒప్పుకోలేదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో మాత్రం కాస్త త‌గ్గాయి. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల‌కు ముందు ధ‌ర‌లు పెరిగితే వ్య‌తిరేకత ఇంకా తీవ్ర‌మ‌య్యే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి బీజేపీ స‌ర్కారు ఆదేశాల‌తోనే ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచ‌డం లేదని అంటున్నారు. ఇప్పుడు ఎన్నిక‌లు ముగిస్తే ఒక్క‌సారిగా రేట్లు పెరుగుతాయి. దీంతో నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు పెరుగుతాయి. ఇక సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు ప‌డ‌డం మాత్రం ఖాయం.