Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ను `పీకే` క‌న్ఫ్యూజ్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   4 April 2022 11:30 PM GMT
కేసీఆర్‌ను `పీకే` క‌న్ఫ్యూజ్ చేస్తున్నాడా?
X
ఆయ‌న జాతీయ రాజ‌కీయాల్లో వ్యూహ‌క‌ర్త‌. రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేశాన‌ని చెప్పుకొనే దిట్ట‌. ఇక‌, ఇటు వైపు చూస్తే.. సుదీర్ఘ పోరాటం చేసి.. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన‌.. బ‌క్క మ‌నిషి! మాట‌ల మాంత్రికుడు. ఎలాంటి స‌మ‌స్య‌నైనా.. త‌న‌కు అనుకూ లంగా మ‌లుచుకునే రాజ‌కీయ పండితుడు.

అయితే.. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ ఒకేసారి రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చారు. వారే.. ఒక‌రు ప్ర‌శాంత్ కిశోర్..ఉర‌ఫ్ పీకే.. అయితే.. రెండోవారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్‌.. పీకేను స‌ల‌హాదారుగా నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇప్ప‌టికే 30 నియోజ‌క‌వ‌ర్గా్ల‌లో పీకే మ‌నుషులు స‌ర్వేలు కూడా చేశార‌ని చెప్పారు.

స‌రే! తెలంగాణ రాజ‌కీయాల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కేసీఆర్‌ను జాతీయ రాజ‌కీయాల్లో హైలెట్ చేయాల‌నేది వీరిద్ద‌రి మ‌ధ్య ఒప్పందం. ఈ క్ర‌మంలోనే బీజేపీ వ్య‌తిరేక‌త కూట‌మి పేరుతో కేసీఆర్ కొన్ని రోజులు విజృంభించారు. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి అనుకూలంగా వ‌చ్చిన ఫ‌లితాల‌తో కేసీఆర్ కొంత వెన‌క్కి త‌గ్గారు. అయితే.. జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ పోషించే పాత్ర విష‌యంలో పీకే ఇస్తున్న సూచ‌న‌లు, స‌ల‌హాలు.. ఏకంగా.. ఆయ‌న‌ను క‌న్ఫ్యూజ‌న్‌లోకి నెట్టేస్తున్నాయ‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

``ఒక సారి నేష‌న‌ల్ పాలిటిక్స్ అంటారు. ఆ వెంట‌నే ప్ర‌త్యేక విమాన‌మో.. హెలికాప్ట‌రో పెట్టుకుని.. కేసీఆర్ రాష్ట్రాలు చుట్టి వ‌స్తారు. ముఖ్య‌మంత్రుల‌ను.. బీజేపీ అంటే గుర్రుగా ఉన్న పార్టీల నేత‌ల‌ను క‌లిసి వ‌స్తారు. మీడియా మీటింగులు పెడ‌తారు.. ఇంకే ముంది.. బీజేపీ ప‌ని ఖ‌తం అయిపోయింద‌ని చెబుతారు.

స‌రేలే.. మ‌న నాయ‌కుడు ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్నాడు.. మంచిదేలే.. అనుకునే స‌రికి.. దానికి మంగ‌ళం పాడేసి.. రాష్ట్రం వ‌రి గురించి.. వ‌ర్రీ అవుతాడు. ఢిల్లీ పెద్ద‌లు వ‌రి కొని తీరాల్సిందే అంటారు. పంజాబ్‌తో స‌మానంగా తెలంగాణ ధాన్యం ఎందుకు కొన‌ర‌ని.. నిల‌దీస్తారు?. ఇదేం వ్యూహ‌మో అర్ధం కావ‌డం లేదు. ఇలా చేస్తే.. కేసీఆర్ ఎటు వెళ్తున్నారు? ఏ దిశ‌గా అడుగులు వేస్తున్నారు? అనేది అర్ధం కావ‌డం లేదు`` అని వీరు చెబుతున్నారు.

ఇక‌, ఈ విష‌యంలో త‌మ నాయ‌కుడు, సీఎం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు... ఎమ్మెల్యేలు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇదిలావుంటే.. మ‌రో శంక కూడా టీఆర్ ఎస్‌ను వెంటాడుతోంది. త‌మ‌కు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న పీకే.. ఇప్పుడు ఈ ఏడాది చివ‌రిలో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తానంటూ.. దాదాపు ప్ర‌తిజ్ఞ చేసినంత ప‌నిచేశాడు.

మ‌రి అక్క‌డ కాంగ్రెస్‌కు ప‌నిచేస్తూ.. ఇక్క‌డ తెలంగాణ‌లో త‌మ‌కు బ‌ద్ధ శ‌త్రువైన‌.. కాంగ్రెస్ విష‌యంలో దానిని ఎలా ఎదుర్కొనాలి.. ఏవిధంగా కాంగ్రెస్ నేత‌ల‌కు చెక్ పెట్టాల‌నే విష‌యంలో ఎలాంటి స‌ల‌హాలు ఇస్తాడు? ఇదేం డ‌బుల్ గేమ్‌? అని ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ఇదంతా చూస్తే.. కేసీఆర్‌ను పీకే క‌న్ఫ్యూజ్ చేస్తున్నాడా? అని సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.