Begin typing your search above and press return to search.

లోకేష్ పై నో పోటీ.. టీడీపీకి పవన్ మేలు

By:  Tupaki Desk   |   18 March 2019 11:21 AM GMT
లోకేష్ పై నో పోటీ.. టీడీపీకి పవన్ మేలు
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన సిద్ధమైంది. ఇప్పటికే పొత్తు చర్చలు ముగించి సీట్ల కేటాయింపును కూడా జనసేనాని పవన్ పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకుంది. బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది. అలాగే సీపీఐ, సీపీఎంలకు 7 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీలను జనసేన కేటాయించింది. ఆశ్చర్యకరంగా సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ తన జీవితంలోతొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతూ మంగళగిరి నుంచి పోటీచేస్తున్నారు.. ఆ సీటులో జనసేన పోటీచేయకపోవడంపై అందరిలోనూ అనుమానాలు బలపడుతున్నాయి.

మంగళగిరిని అక్కడ ఏమాత్రం బలం లేని సీపీఐకి జనసేన కేటాయించినప్పుడే దీనివెనుక ఏదైనా గూడుపుఠానీ ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే వైసీపీ మద్దతుదారులు పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో రహస్య ఒప్పందం చేసుకొనే ఇలా సీట్ల కేటాయింపులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా లోకేష్ సహా బలమైన టీడీపీ నేతలున్న చోట జనసేన బరిలోకి దిగడం లేదని ఆడిపోసుకుంటున్నారు.

మంగళగిరిలో లోకేష్ పై పోటీపడకపోవడానికి జనసేనాని పవన్ దగ్గర సమాధానం లేదు. పొత్తులో భాగంగా కేటాయించామని మాత్రమే చెబుతున్నారు. మంగళగిరిలో ఎలాగూ సీపీఐ గెలవదని.. బలం లేదని తెలుసు. అయినా ఆ సీటును సీపీఐకి జనసేన ఎందుకిచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తోంది.

2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం మంగళగిరిలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ కాపు ఓటు బ్యాంకు ఎక్కువ. జనసేన పోటీ చేస్తే ప్రత్యర్థుల ఓట్లను చీల్చి ఓడించే సత్తా ఉంటుంది. కానీ అక్కడ బలంగా ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఓడించేందుకే జనసేన బలమైన క్యాండిడేట్ ను బరిలో నిలుపలేదనే టాక్ వినిపిస్తోంది. ఇది అంతిమంగా లోకేష్ ను గెలిపించేదుకేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ ఆరోపణలకు బలం చేకూరుతోంది. టీడీపీ-జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ నిజమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.