Begin typing your search above and press return to search.

రాజకీయం ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అవుతోందా ?

By:  Tupaki Desk   |   14 Oct 2021 6:07 AM GMT
రాజకీయం ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అవుతోందా ?
X
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాజకీయం ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అవటం ఏమిటనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుండి పోటీచేస్తారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇలాంటి ప్రచారానికి ఆధారాలు అంటు ఏమీ ఉండవు. జస్ట్ పార్టీల్లో ప్రచారం జరుగుతుండటంతో పాటు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయంతే.

ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ప్రకారం ఏపీకి మూడు రాజధానులు బజ్ నడుస్తోంది. న్యాయరాజధానిగా హైకోర్టును కర్నూలుకు తరలించటమే ఇక్కడ కీలకంగా ఉంది. ఎందుకంటే అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు రీ లోకేట్ చేయాలంటే అందుకు సుప్రీంకోర్టు కొలీజియం+హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతి కావాలి. ఈ కారణంగానే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ముందుకు పోవటం లేదు. హైకోర్టు రీ లొకేషన్ రెడీ అయితే మిగిలిందంతా కేవలం లాంఛనమే.

ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలి వెళ్ళిపోవటం జగన్ చేతిలో పనే. అమరావతి ఎలాగూ శాసన రాజధానిగానే కంటిన్యూ అవుతుంది కాబట్టి సమస్యే లేదు. ఈ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకునే రాబోయే ఎన్నికల్లో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీచేయబోతున్నారంటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జగన్ పులివెందుల నుంచి చంద్రబాబు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పవన్ ఎలాగూ విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలోనే పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి పవన్ మళ్ళీ గాజువాక నుండో లేకపోతే అక్కడే ఏదో ఓ నియోజకవర్గం నుండి పోటీచేసే అవకాశముంది. కానీ దశాబ్దాలుగా పట్టున్న పులివెందుల, కుప్పం నియోజకవర్గాలను జగన్, చంద్రబాబు వదులుకుంటారా అనేది ఇక్కడ కీలకం. జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే జగన్, చంద్రబాబు తమ నియోజకవర్గాలను వదులుకోకుండానే రెండో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది.

అలా పోటీ చేయబోయే రెండో నియోజకవర్గమే ఉత్తరాంధ్రలో ఉండబోతోందనేది సారాంశం. ఉత్తరాంధ్ర అంటే ఒక్క వైజాగ్ మాత్రమే కాదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా భాగమే. మరి రెండో నియోజకవర్గంలో పోటీ అంటు చేస్తే వైజాగ్ జిల్లా లేదా నగరానికి మాత్రమే పరిమితమవుతారా ? లేకపోతే వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నియోజవర్గాలను ఎంపిక చేసుకుంటారా అన్నదే మాత్రం తేలటం లేదు. మొత్తం మీద రెండు చోట్ల నుండి జగన్, చంద్రబాబు పోటీ చేస్తే మాత్రం సంచలనమే అవుతుందనటంలో సందేహం లేదు. అంటే రాజకీయం రాయలసీమ నుండి ఉత్తరాంధ్రకు షిఫ్ట్ అయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇఫుడు జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే.