Begin typing your search above and press return to search.

మోడీ దూకుడు.. భార‌త్ ప‌రువు తీసిందా!

By:  Tupaki Desk   |   15 Jan 2023 3:30 AM GMT
మోడీ దూకుడు.. భార‌త్ ప‌రువు తీసిందా!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప్ర‌పంచ దేశాల ముందు ప‌రువు తీస్తోందా? దేశాన్ని అగ్ర‌గామిగా నిల‌పాల‌నుకున్న ఏకైక ప్ర‌ధాన మంత్రిగా తాను చ‌రిత్ర సృష్టించాల‌ని భావిస్తున్న మోడీ.. ఆదిశ‌గా తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. ప్ర‌పంచం ముందు భార‌త్ చేతులు క‌ట్టుకుని స‌మాధానం చెప్పాల్సి న పరిస్థితిని తీసుకువ‌స్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌పంచంలో భార‌త్ అభివృద్ది చెందుతున్న దేశంగా ఉంది.

అయితే.. కొన్నాళ్ల కిందట మోడీ ఈ వాద‌న‌ను ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు గ‌డిచిపోతున్నా.. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండ‌డం ఏంటి డామిట్‌! అన్నారు. అభివృద్ధి చెంది తీరాల్సిందేన‌ని తేల్చి చెప్పారు. ఇది మంచిదే! కానీ, ఈ దిశ‌గా తీసుకుంటున్న నిర్ణ‌యాలు వేస్తున్న అడుగులు మాత్రం ఇప్పుడు వివాదంగా మారాయి. తాజాగా క‌రోనా వ్యాక్సిన్‌ను 220 దేశాల‌కు ఉచితంగా ఇచ్చామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్న మోడీ ప‌రువు ఒక్క ద‌గ్గు మందుతో తునాతున‌క‌లు అయిపోయింది.

మ‌న దేశంలో మేకిన్ ఇండియా కార్య‌క్ర‌మం కింద‌.. ద‌గ్గు మందును త‌యారు చేశారు. దీనిని ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌రాబాద‌రాగా స‌ర‌ఫ‌రా చేశారు. అయితే.. దీనిని తీసుకున్న గాంబియా, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో చిన్నారుల మ‌ర‌ణాలు కోకొల్లలుగా ఉన్నాయి. నిజానికి దీనిని దేశంలో ప‌రీక్షించాల‌ని.. కొంద‌రు నిపుణులు సూచించారు. అయితే, డ్రగ్స్‌కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇచ్చిన నివేదిక చాల‌న్న కేంద్రం .. వెంట‌నే ప్ర‌పంచ దేశాల‌కు ఈ మందును పంపిణీ చేసేసింది.

అక్క‌డ వినియోగించిన త‌ర్వాత‌.. సుమారు.. 200 మంది చిన్నారులు చ‌నిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ భార‌త్‌పై తాజాగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. ఈ మందుల్లో ఇథలైన్‌ గ్లైకాల్‌, డై ఇథలైన్‌ గ్లైకాల్‌ ఉనికేలేదని భార‌త్ చెప్పిన మాట‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జెనీవా లాబరేటరీలో ఆ శాంపిల్స్‌ పరీక్షించిన‌ప్పుడు విషరసాయనాల ఉనికి అత్యధికంగా ఉన్నట్టు తేలింద‌ని.. దీనికి ఏం చెబుతార‌ని.. తాజాగా భార‌త ప్ర‌భుత్వానికి ఐక్య‌రాజ్య‌సమితి తాఖీదు పంపింది.

ఆఫ్రికన్‌ దేశమైన గాంబియా పార్లమెంటు నివేదిక ఒకటి భారతదేశమందులే తమ పిల్లల మరణాలకు కారణమని నిర్థారించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ మేడిన్‌ ఇండియా దగ్గుమందు విషయంలో అన్నిదేశాలకూ హెచ్చరిక చేయడంతో పాటు, మెయిడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ అన్ని నిబంధనలనూ ప్రమాణాలనూ ఉల్లంఘించి మందులను తయారుచేస్తున్నదని కూడా చెప్పింది.

ఉజ్బెకిస్థాన్‌ తన పిల్లలమరణాల విషయంలో గాంబియాకంటే కఠినంగా, పట్టుదలగా వ్యవహరించింది. అత్యున్నతస్థాయి డ్రగ్‌కంట్రోలర్‌ సహా అనేకమందిని వెంటనే సస్పెండ్‌ చేయడంతోపాటు, అంతర్గత విచారణలో తేలిన విషయాలను ప్రపంచ ఆరోగ్యసంస్థతో పంచుకుంది. దీంతో ఇప్పుడు ఆ చిన్నారుల మ‌ర‌ణాలు.. భార‌త్‌మెడ‌కు చుట్టుకున్నాయి. ఇప్పుడు భార‌త్ అంత‌ర్జాతీయ స‌మాజం ముందు చేతులు క‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. స‌ద‌రు ద‌గ్గుమందును త‌క్ష‌ణం వెన‌క్కి తీసుకువెళ్లాల‌ని.. ఐక్య‌రాజ్య‌స‌మితి హుకుం జారీ చేయ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.