Begin typing your search above and press return to search.

ఏపీపై రాహుల్ ఆశలా? ఎలా?

By:  Tupaki Desk   |   22 Sep 2022 3:30 AM GMT
ఏపీపై రాహుల్ ఆశలా? ఎలా?
X
అడ్డుగోలు విభజన చేసిన ఫలితంగా రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినేసింది. ఇందులో కూడా ఏపీలో అయితే జనాలు కాంగ్రెస్ పార్టీని వంద అడుగుల గొయ్యితీసి సమాధి చేసేశారు. ఏ దశలో కూడా ఇప్పుడిప్పుడే కోలుకునే అవకాశం కూడా పార్టీకి జనాలు ఇవ్వటం లేదు.

ఎన్నిక ఏదైనా కనీసం డిపాజిట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు దక్కించుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థితిలో పార్టీ అగ్రనేత రాహుల్ పైనే రాష్ట్ర కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నది.

ఇంతకీ విషయం ఏమిటంటే భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో రాహుల్ 100 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ యాత్ర సాగబోతోంది. నాలుగు రోజుల పాటు జరగబోయే పాదయాత్ర అక్టోబర్ 17వ తేదీన ఎంటరై 21వ తేదీన ముగియబోతోంది. 17వ తేదీ సాయంత్రం కర్నాటకలో నుంచి ఏపీలోని అనంతపురం రాష్ట్రంలోని రాహుల్ ఎంటరవుతారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో సాయంత్రం 4-7 గంటల మధ్యలో పాదయాత్ర ఉంటుంది.

ఓబుళాపురం మైనింగ్ ప్రాంతం గుండా రాహుల్ పాదయాత్ర సాగుతుంది. మూడు రోజుల యాత్ర తర్వాత 20వ తేదీన మోకాలోకి ప్రవేశించి కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోకి రాహుల్ ప్రవేశిస్తారు. రాత్రికి హళేబీడులో బస చేస్తారు. 21న ఘనాపురం, 22న కుప్పగల్ మధ్యాహ్న భోజనం చేస్తారు. రాత్రికి మంత్రాలయం నియోజకవర్గంలోని పొసిగి, 23న రాచమల్లులో మధ్యాహ్న భోజనం చేస్తారు. అదే రోజు రాత్రికి మళ్ళీ రాహుల్ కర్నాటకలోకి ప్రవేశిస్తారు.

పాదయాత్ర మొదలైన తర్వాత తమిళనాడు, కేరళ, కర్నాటకలో రాహుల్ పాదయాత్రకు మంచి స్పందనే కనిపించింది. మరి ఏపీలో పరిస్ధితి ఏమిటనేదే కీలకమైంది. ఏపీలో పార్టీకి నేతలూ లేరు, కార్యకర్తలూ లేరు. ఉన్నవాళ్ళు కూడా వేరే పార్టీల్లోకి వెళ్ళలేని వారు మాత్రమే.

ఇపుడు కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో అత్యధికులు జనబలం లేనివాళ్ళే. అందుకనే కాంగ్రెస్ పార్టీ కేవలం మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇలాంటి దీనస్థితిలో ఉన్న పార్టీకి రాహుల్ పాదయాత్ర ఊపునిస్తుందా ?




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.