Begin typing your search above and press return to search.

రిల‌య‌న్స్ రానున్న రోజుల్లో దేశీ నెట్ ఫ్లిక్స్!

By:  Tupaki Desk   |   29 Jan 2019 5:14 AM GMT
రిల‌య‌న్స్ రానున్న రోజుల్లో దేశీ నెట్ ఫ్లిక్స్!
X
వ్యాపారం ఎంత పెద్ద‌దైనా కావొచ్చు. ఒక్క చిన్న త‌ప్పు కాదు.. ఎంత పెద్ద వ్యాపార సంస్థ అయినా ఇట్టే కూలిపోయే ప‌రిస్థితి. టీవీ ఛాన‌ళ్ల‌లో దిగ్గ‌జంగా చెప్పే జీ ఎంట‌ర్ టైన్ మెంట్ పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సంస్థ‌కు చెందిన వాటాను విక్ర‌యించ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో జీల్ (జీ ఎంట‌ర్ ప్రైజ‌స్‌) మీద రిల‌య‌న్స్ జియో క‌న్నేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మీడియా కంటెంట్ పై దృష్టి సారించిన జియోకు జిల్ క‌లిసి వ‌చ్చేదిగా చెబుతున్నారు. దీంతో.. ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు క‌న్నేసిన జీల్ మీద దేశీయంగా జియో దృష్టి సారించిన‌ట్లుగా స‌మాచారం.. జీ ప్ర‌మోట‌ర్ సుభాష్ చంద్ర వాటాల్లో స‌గ‌భాగాన్నికొనుగోలు చేసేందుకు జియో ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తోనే జ‌ట్టు క‌డ‌తామ‌ని చెప్పిన జీల్ ప్ర‌మోట‌ర్లు.. తాజాగా దేశీ సంస్థ‌ల‌తోనూ భాగ‌స్వామ్యం కుదుర్చుకునే అవ‌కాశాన్ని ప‌రిశీలిస్తామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

జీల్ లో వాటాలు ద‌క్కించుకునేందుకు అంత‌ర్జాతీయ దిగ్గ‌జ సంస్థ‌లు అమెజాన్.. యాపిల్‌.. టెన్సెంట్‌.. ఆలీబాబా.. లాంటి సంస్థ‌లు పోటీ ప‌డుతున్న‌వేళ‌.. దేశీయంగా జియో దృష్టిసారించిన‌ట్లుగా తెలుస్తోంది. రిల‌య‌న్స్ జియోకు మీడియా సంస్థ‌ల్లో వాటాల్నికొనుగోలు చేయ‌టంకొత్తేం కాదు. ఇప్ప‌టికే ప‌లు మీడియా.. ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ‌ల్లో రిల‌య‌న్స్ పెట్టుబ‌డులు పెట్టిన విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

నెట్ వ‌ర్క్ 18లో 75 శాతం.. న్యూస్ కి సంబందించి సీఎన్ ఎన్-న్యూస్ 18.. ఎంట‌ర్ టైన్ మెంట్ కి సంబంధించి వ‌యాకామ్ 18తో పాటు సినీ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ లాంటివి ఇందులో భాగంగా చెప్పాలి. అంతేనా.. మీడియా మొఘ‌ల్ రామోజీరావుకు చెందిన ఈటీవీ ఇత‌ర భాష‌ల సంస్థ‌ల వాటాల్ని అంబానీకి చెందిన సంస్థ‌లే టేకోవ‌ర్ చేశాయి.

ఇవి కాకుండా హిందీ.. ఇంగ్లిషుతో స‌హా ప‌లు భార‌తీయ భాష‌ల్లో డిజిట‌ల్‌.. ప‌బ్లిషింగ్ సంస్థ‌లూ రిల‌య‌న్స్ బొకేలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జీల్ ను సొంతం చేసుకుంటే గ్రూప్ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. దేశీయ నెట్ ఫ్లిక్స్ కావ‌టం జియో ఒక్క‌టితోనే సాధ్యమ‌వుతుంద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. జియోను దేశీయంగా కొట్టే వారే ఉండ‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.