Begin typing your search above and press return to search.

తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ ప్రక్షాళన చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   27 Nov 2022 3:30 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ ప్రక్షాళన చేస్తున్నాడా?
X
తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నాడా? సీనియర్లను సాగనంపుతున్నాడా? తనకు అడ్డు వస్తూ అడుగడుగునా అడ్డుకుంటున్న వారిని పొగబెట్టి పంపిస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి వర్గాలు. రేవంత్ నాయకత్వం కింద పనిచేయడం ఇష్టం లేక దశాబ్ధాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతూ.. ఎవరినీ పట్టించుకోక పోతుండడమేనన్న వాదన వినిపిస్తోంది. అందరినీ కలుపుకొని వెళ్లాలని జాగ్రత్తలు చెప్పి మరీ హైకమాండ్ పీసీసీ పదవి ఇచ్చినా రేవంత్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు తగ్గడం లేదు. ఒక్కో సీనియర్ నేత కమలం గూటికి చేరిపోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారశైలి నచ్చడం లేదంటూ వైదొలుగుతున్నారు.టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవడంలో విఫలమయ్యారన్న భావన ఏర్పడుతోంది. అందుకే సీనియర్లు చేజారిపోకుండా కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాకతో బలోపేతమైన తెలంగాణ కాంగ్రెస్ ను అధికారం దిశగా నడిపించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ల అసమ్మతితో ఆగమాగమైన తెలంగాణ కాంగ్రెస్ ను పట్టాలెక్కించడమే ధ్యేయంగా ప్రియాంక గాంధీ పావులు కదుపుతున్నారు.

అధిష్టానం ఆదేశానుసారం పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలందరినీ ఇంటికి వెళ్లి కలిశారు. అందరి మద్దతు కోరారు. తనను వ్యతిరేకించిన వీహెచ్, కోమటిరెడ్డిలను కలిశారు. ఇంకా అంత బాగుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ నేతలంతా రేవంత్ వ్యవహారశైలి, నాయకత్వంపై విమర్శలు ప్రారంభించారు.

జగ్గారెడ్డి మొదట్లో సానుకూలంగా ఉన్నా.. ఇప్పుడు పూర్తి వ్యతిరేకమయ్యారు. తనను అసలు పట్టించుకోకపోవడంతోనే జగ్గారెడ్డి వ్యతిరేకమయ్యారు. ఇతర నేతలనూ పట్టించుకోవడం లేదు. స్ట్రాటజిస్ట్ ఇస్తున్న సర్వేలు, నివేదికలు, రేవంత్ రెడ్డి చేర్పిస్తున్న చేరికలు అన్నీ సీనియర్లకు పొగబెట్టేలా ఉండడంతో వారంతా అసమ్మతి రాజేస్తూ బీజేపీ ఆఫర్ కు తలొగ్గి వెళ్లిపోతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎందరినీ మార్చినా.. రేవంత్ రెడ్డి వచ్చినా గాడిన పడడం లేదు. పార్టీ నేతలను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో కాకుండా రెండు, మూడు రకాల కమిటీలను నియమించాలని చూస్తున్నారు.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, టీపీసీసీ ప్రచార కమిటీ , సమన్వయ కమిటీలను నియమించి మొత్తం ఆ కమిటీల మీదుగానే నిర్ణయాలు జరిగేలా చూడాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తంగా రేవంత్ రెడ్డి మాత్రం.. హైకమాండ్ వద్ద తన పనితీరులో సెంట్ పర్సంట్ మార్కులేయించుకోవడంలో విఫలమయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.