Begin typing your search above and press return to search.

ఆ ఓట‌మితో రేవంత్ కుంగిపోయారా..!

By:  Tupaki Desk   |   8 July 2022 8:49 AM GMT
ఆ ఓట‌మితో రేవంత్ కుంగిపోయారా..!
X
ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు. ఇలాంటి వ్య‌క్తులు రాజ‌కీయాల్లో అరుదుగా ఉంటారు. పార్టీల‌తో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాతో నెగ్గుకురాగ‌ల‌రు. గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా ఎల్ల‌ప్పుడూ పూర్తి ఆత్మ‌విశ్వాసంతో తొణికిస‌లాడుతుంటారు. టీఆర్ఎస్ నుంచి మొదలై టీడీపీ, కాంగ్రెస్ వ‌ర‌కు సాగిన త‌న ప్ర‌స్థానంలో ఏనాడూ వెన్ను చూపింది లేదు. అలాంటి వ్య‌క్తి తొలిసారిగా కుంగిపోయారా..? ఆ ఓట‌మితో క‌ల‌త చెందారా..? అంటే ఈ విష‌యాన్ని రేవంతే స్వ‌యంగా బ‌హిరంగంగా పంచుకోవ‌డంతో క‌ల‌క‌లం చెల‌రేగింది.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టి జూలై 7 నాటికి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా గాంధీ భ‌వ‌న్ లో రేవంతును ఘ‌నంగా స‌న్మానించారు. మిగ‌తా కార్య‌వ‌ర్గాన్ని కూడా అభినందించారు. అలాగే.. సీడ‌బ్ల్యూసీ శాశ్వ‌త ఆహ్వానితుడిగా నియ‌మితులైన టి.సుబ్బ‌రామిరెడ్డిని ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ స‌మావేశంలో సుబ్బ‌రామిరెడ్డి రేవంతును అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు రేవంత్ నిద్ర పోకుండా ప‌ని చేస్తున్నార‌ని కితాబునిచ్చారు. అలాగే.. ప‌లువురు ముఖ్య నేత‌లు పార్టీలో చేరారు. రేవంతు స‌న్నిహితుడు జ‌డ్చ‌ర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్‌, దేవ‌ర‌కొండ‌ టీడీపీ నేత బిల్యా నాయ‌క్ కాంగ్రెస్‌ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ ఉద్వేగంతో మాట్లాడిన ప‌లు వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

నేత‌లంద‌రం స‌మ‌ష్టిగా ప‌నిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామ‌ని.. ఏడాది త‌ర్వాత సోనియా గాంధీ ఎవ‌రిని సీఎంగా నియ‌మిస్తే వారిని ప‌ల్ల‌కిలో మోసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోబెడ‌తామ‌ని తెలిపారు. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి హోదాల కంటే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి గొప్ప‌ద‌ని వెల్ల‌డించారు. రాముడికి హ‌నుమంతుడు ఎలా ప‌నిచేశారో.. తాను కూడా సోనియా, రాహుల్ గాంధీకి అలాగే జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓడినందుకు తాను కుంగిపోతే కార్య‌క‌ర్త‌లు అండ‌గా నిల‌బ‌డ్డార‌ని తెలిపారు. త‌న ల‌క్కీ నంబ‌రు 9 అని.. అందుకే 99 సీట్లు ఇచ్చి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

అయితే.. మిగ‌తా వ్యాఖ్య‌ల‌న్నీ ఎలా ఉన్నా హుజూరాబాద్ ఎన్నిక‌లో ఓట‌మితో కుంగిపోయాన‌నే విష‌య‌మే కార్య‌క‌ర్త‌ల్లో భావోద్వేగాన్ని నింపింది. ఆ ఓట‌మిపై ఇన్నాళ్లూ మ‌నోనిబ్బ‌రంతో ఉన్న రేవంత్ తొలిసారి త‌న మాన‌సిక సంఘ‌ర్ష‌ణను వివ‌రించారు. అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన రెండు నెల‌ల‌కే ఆ ఎన్నిక రావ‌డం.. అందులో కేవ‌లం 3 వేల ఓట్లు మాత్ర‌మే రావ‌డంతో అంద‌రూ నిరాశ‌లో మునిగిపోయారు. పార్టీకి స‌రైన అభ్య‌ర్థి దొర‌క‌క‌.. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌క‌.. పోటీచేస్తామ‌న్న వారు కూడా ముఖం చాటేయ‌గా.. చివ‌రికి విద్యార్థి నాయ‌కుడు వెంక‌ట్ ను బ‌రిలోకి దింపాల్సి వ‌చ్చింది.

ఆ ఉప ఎన్నిక పార్టీల ప‌రంగా కాకుండా.. కేవ‌లం కేసీఆర్‌, ఈటెల మ‌ధ్య పోరుగా మార‌డంతో ప్ర‌జ‌లు ఈటెల‌కే మ‌ద్ద‌తు తెలిపారు. క‌నీసం ప‌ది నుంచి ఇర‌వై వేల మంది ఉన్న కాంగ్రెస్ సంప్ర‌దాయ ఓటు బ్యాంకుకు కూడా గండిప‌డి ఈటెల రాజేంద‌ర్ ఘ‌న విజ‌యం సాధించారు. ఆ ఫ‌లితాల‌పై అప్పుడు రేవంత్ మ‌నోధైర్యం చూపించినా లోప‌ల దాగున్న బ‌డ‌బాగ్ని ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. ఇలాంటి ఆటుపోట్లు ఇక‌పై ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ త‌ట్టుకొని రేవంత్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ‌తారో వేచి చూడాలి.