Begin typing your search above and press return to search.

మనోడి ఓటమి పక్కా.. బ్రిటన్ ప్రధాని పీఠం లిజ్ ట్రస్ దేనట

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:04 AM GMT
మనోడి ఓటమి పక్కా.. బ్రిటన్ ప్రధాని పీఠం లిజ్ ట్రస్ దేనట
X
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా.. పవర్ ఫుల్ కంట్రీగా చెప్పే బ్రిటన్ కు తదుపరి ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంటారని భావించినా.. అదేమీ సాధ్యం కాదన్న విషయాన్ని తాజాగా వెలువడిన సర్వేలు తేల్చేస్తున్నాయి.

బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల వేళకు ప్రధాని ఎన్నిక పోలింగ్ గడువు ముగిసింది. గడిచిన కొద్ది రోజులుగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేందుకు టోరీలకు ఉన్న అవకాశం పూర్తైంది.

పోలింగ్ గడువు ముగిసిన అనంతరం.. ఎన్నికల ఫలితాలపై పలువురు చేసిన సర్వేలను వెల్లడించారు. ఇందులో అత్యధికంగా రిషి ఓటమి ఖాయమని.. అదే సమయంలో దేశ విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న లిజ్ ట్రస్ కాబోయే బ్రిటన్ ప్రధానమంత్రి అన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకోవటానికి వీలుగా జరిగిన చివరి పోటీలో రిషి వెనుకబడిన వైనాన్ని వెల్లడించారు.

బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ తదుపరి విజేత ఎవరన్న విషయాన్ని వెల్లడిస్తారు. ఆ తర్వాతి రోజు.. అంటే మంగళవారం ప్రధానిగా వ్యవహరిస్తున్న బోరిస్ జాన్సన్ క్వీన్ ఎలిజబెత్ ను కలిసి.. తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారు.

దాదాపు 2 లక్షల మంది టోరీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఓటేసిన 1.60 లక్షల మందిలో అత్యధికులు లిజ్ ట్రస్ వెంటే ఉన్నట్లుగా తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. లిజ్ ట్రస్ పార్టీకే చెందిన భారత సంతతి వ్యక్తి రిషి తన ఓటమిని ఒప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.