Begin typing your search above and press return to search.

ఆ రోడ్డు ఈ ఎమ్మెల్యే గెలుపును తేల్చనుందా?

By:  Tupaki Desk   |   17 Nov 2022 7:52 AM GMT
ఆ రోడ్డు ఈ ఎమ్మెల్యే గెలుపును తేల్చనుందా?
X
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నమ్మిన బంటుల్లో ఒకరు.. జక్కంపూడి రాజా. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు తనయుడిగా గత ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన రాజా తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు.

కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మంత్రి పదవి కూడా వస్తుందని అప్పట్లో వార్తలు వినపడ్డా అవి నిజం కాలేదు. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే జక్కంపూడి రాజాకు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. ఈ పదవిలో రాజా దాదాపు రెండేళ్లు ఉన్నారు.

కాగా మరోమారు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాజా పావులు కదుపుతున్నారు. అయితే ఆయనకు రోడ్డు రూపంలో పెద్ద అడ్డంకి కనిపిస్తోందని అంటున్నారు.

అన్ని వర్గాల ప్రజలతో సఖ్యతగా మెలుగుతూ.. ఎవరికి ఏం పని కావాలన్నా చేసే పెట్టే నేతగా జక్కంపూడి రాజా పేరు తెచ్చుకున్నారు. తన తండ్రి ఆదర్శాలను పుణికిపుచ్చుకుని ఈ విషయలో ముందుకు సాగుతున్నారు.

అయితే రాజానగరం నియోజకవర్గంలో ఉన్ కాటవరం - పురుషోత్తపట్నం (పోలవరం ప్రాజెక్ట్ ఉన్నంతవరకు) రోడ్డు ఎప్పటి నుంచో తీవ్ర దుస్థితిలో ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇది సింగిల్‌ రోడ్డుగా ఉండిపోయింది. ఎవరి వల్లా కాని ఈ రోడ్డు సంగతి తన హయాంలో తేల్చాలని జక్కంపూడి రాజా అధికారంలోకి వచ్చిన వెంటనే కంకణం కట్టుకున్నారు.

ఇందుకోసం ఆర్‌అండ్‌ బీ అధికారులతో అంచనాలు కూడా తీసుకున్నారు. సింగిల్‌ లైను రోడ్డుగా ఉన్న దీన్ని నాలుగు లేన్ల రహదారిగా మార్చడానికి రాజా కంకణం కట్టుకున్నారు. సకాలంలో బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదనే భయంతో కాంట్రాక్టర్లు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టానికి వెనుకంజ వేసినా రాజా వెనక్కి తగ్గలేదు. తన స్నేహితుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులు సాగేలా చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ.20 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది.

మళ్లీ నిధుల లేమితో ఈ రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే ఈ రోడ్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం తో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు . ఎంత చేసిన ఈ రోడ్ కంప్లీట్ చెయ్యకపోతే రాజా మళ్ళి గెలవడం కష్టం అని ప్రజలు అంటున్నారు. జక్కంపూడి రాజా పట్టు వదలకుండా సీఎం వైఎస్‌ జగన్‌ వద్దకు వెళ్లి నిధులు మంజూరు చేయించుకున్నారని వినిపిస్తోంది. దీంతో రోడ్డు నిర్మాణ పనులు మళ్ళి చురుగ్గా సాగుతాయని చెబుతున్నారు. నాలుగు లేన్ల రహదారితో ఇన్నాళ్లూ అష్టకష్టాలు పడ్డ ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయి.

వాస్తవానికి ఈ రోడ్డును పూర్తి చేయించలేకపోతే అన్నీ ఉన్నా చంద్రుడికో మచ్చ అన్నట్టు జక్కంపూడి రాజా ఖాతాలో ఈ రోడ్డు పరిష్కారం కాని సమస్యగా ఉండిపోయేది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో రోడ్ల దుస్థితి కూడా ఒక ప్రాధాన్య అంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాటవరం – సీతానగరం–పురుషోత్తపట్నం రోడ్డును శరవేగంగా పూర్తి చేసి మరోమారు రాజానగరంలో రాజుని నేనేనని నిరూపించుకోవాలన్న పట్టుదలతో జక్కంపూడి రాజా ఉన్నారు. మరి ఎలక్షన్స్ లోపు అయ్యేపనేనా చూద్దాం .