Begin typing your search above and press return to search.

రష్యాకు ప్రకృతి వరం.. ఉక్రెయిన్ కు శాపం కానుందా?

By:  Tupaki Desk   |   1 Nov 2022 1:30 PM GMT
రష్యాకు ప్రకృతి వరం.. ఉక్రెయిన్ కు శాపం కానుందా?
X
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య తొమ్మిది నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా ఒకసారి పై చేయి సాధిస్తే మరోసారి ఉక్రెయిన్ సత్తా చాటుతోంది. ఎవరికి వారు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్నామని ప్రకటిస్తున్నాయి. దీంతో ఇరు దేశాలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే నేటికీ కొనసాగుతూనే ఉంది.

రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి ఫెల్యుయిర్ స్పష్టం కన్పిస్తోంది. ప్రపంచ దేశాలేవీ కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో నేరుగా పాల్గొనకపోయినా ఇండైరెక్ట్ గా సహకారం అందిస్తున్నాయి. ఉక్రెయిన్ కు అమెరికా.. నాటో దేశాలు ఆయుధాలను సమకూరుస్తూ రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నారు.

రష్యా మాత్రం సింగిల్ గానే ఉక్రెయిన్ పై దాడి చేస్తోంది. ఉక్రెయిన్ ను నాటోలో చేరకుండా ఆపడం.. లేదంటే కొంత భూభాగాన్ని తమలో కలుపుకోవడం వంటికే రష్యా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా ఆచితుచి అడుగులు వేస్తూ ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఉక్రెయిన్ రష్యా చర్యలను బలంగా తిప్పికొడుతోంది.

ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కన్పించడం లేదు. దీంతో రష్యా రెండో ప్రపంచ యుద్ధం నాటి వ్యూహాలకు పదును పెడుతూ ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. రష్యా ప్రయత్నానికి ప్రకృతి నుంచి శీతాకాలం రూపంలో తోడ్పాటు లభించనుంది. దీంతో రష్యన్ సేన ఈ యుద్ధంలో పైచేయి సాధించే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది.

శీతాకాలంలో రష్యాతో యుద్ధం చేసి ఇప్పటి వరకు ఏ దేశం కూడా గెలిచిన దాఖలాలు లేవు. రష్యాకు ప్రకృతి అందించిన గొప్ప వరకే శీతాకాలం. ప్రపంచాన్ని గడగడలాడించిన నెపోలియన్ బోనాపార్టే.. హిట్లర్ సేనలను కూడా రష్యన్లు తుక్కు తుక్కుగా ఓడించాడానికి నాడు శీతాకాలమే కలిసొచ్చింది. దీంతో రష్యన్లు శీతాకాలాన్ని చాలా గౌరవంగా 'జనరల్ వింటర్' లేదా 'జనరల్ ఫ్రాస్ట్' అని పిలుస్తుంటారు.

మరో వారంలో శీతాకాలం ప్రారంభం కానుండటంతో ఉక్రెయిన్ కు సహకారం అందిస్తున్న నాటో దళాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. చలిని తట్టుకొని యుద్ధం చేయాలంటే సైనికులు ప్రత్యేకమైన దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఏ చిన్న గాయమైన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ పరిస్థితులను రష్యా అడ్వాంటేజ్ గా తీసుకుని ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం మెండుగా ఉంది.

ఈనేపథ్యంలో ఉక్రెయిన్ సేనలు తమవైపు వేగంగా రాకుండా రష్యా లుహన్స్క్ ప్రాంతంలో 'డ్రాగన్ టీత్' వ్యూహం అమలు చేస్తోంది. త్రికోణంలో భారీ బరువు ఉన్న దిమ్మలను రెండు వరుసల్లో కిలోమీటర్ల మేర పాతిపెడతారు. దీని చుట్టూ మందుపాతరలను అమలు పరుస్తారు. దీంతో యుద్ధ ట్యాంకులు.. వాహనాలు వేగంగా ముందుకు కదలలేవు.

ఈ వ్యూహాన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా నాజీ జర్మనీపై వాడి పైచేయి సాధించింది. ఈ వ్యూహం ద్వారా రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ లో స్వాధీనం చేసుకున్న భూభాగాల రక్షణను పటిష్టం చేసుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు చలి తీవ్రత పెరిగితే విద్యుత్, ఆయిల్ వినియోగం పెరగనుంది.

ఈ మేరకు రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ లోని విద్యుత్ గ్రిడ్లపై ఫోకస్ పెట్టింది. అలాగే తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగేలా చేస్తుంది. దీంతో ఉక్రెయిన్ పౌరుల నుంచి ఆ దేశంపై యుద్ధాన్ని విరమింపజేయాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే రష్యాతో కాళ్లబేరానికి ఉక్రెయిన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.