Begin typing your search above and press return to search.

'జనసేన' నుంచి రెండో టికెట్‌ దళిత మహిళకు..?

By:  Tupaki Desk   |   27 Jan 2019 9:57 AM GMT
జనసేన నుంచి రెండో టికెట్‌ దళిత మహిళకు..?
X
ఏపీలో మరి కొద్ది వారాల్లోనే ఎన్నికలు జరగనుండడంతో అధికార పార్టీ టీడీపీతో పాటు వైసీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నాయి. దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే సీట్లు ఖరారు అని చెబుతున్న వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జులుగా ఉన్నవారే అభ్యర్థులని అధినేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పార్టీ జనసేన సైతం అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కొన్ని నెలల కిందటే తూర్పూగోదావరి జిల్లాలోని మూమాదివరం నియోజకవర్గ అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును ఖరారు చేశారు.


తాజాగా గన్నవరం నుంచి రెండో అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి జనసేన నుంచి దళిత మహిళ అయిన పముల రాజేశ్వరిని బరిలోకి దించే యోచనలో ఉంది. తమ పార్టీ బడుగు బలహీన వర్గాలను ఆదరిస్తుందని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా పార్టీ నుంచి మొట్ట మొదటిసారిగా దళిత మహిళకు అవకాశం ఇచ్చిన పేరు ఉంటుందని పవన్‌ భావిస్తున్నట్లు సమాచారం.

2004 ఎన్నికల్లో గన్నవరం నియోజకం వర్గం నుంచి రాజేశ్వరి కాంగ్రెస్‌ తరుపున విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల సంఖ్య ఎక్కువే. వీరిని ఒక్కతాటిపైకి తేవడంలో రాజేశ్వరి తీవ్రంగా కృషి చేశారు. ఆ తరువాత ఆమె జనసేన పార్టీలో చేరారు. దీంతో ఆమెకు టికెట్‌ ఇస్తే విజయం ఖాయమని జనసేన లోని సీనియర్లు పవన్‌కు తెలిపినట్లు సమాచారం. అందుకే ఆమెకే టికెట్‌ కేటాయించే అవకాశం ఉంది.

ఇక ఈ నియోజకవర్గంలో టీడీపీ తరుపున పి నారాయణ మూర్తిని, వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబులకు టికెట్‌ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పవన్‌ తీసుకున్న నిర్ణయంపై ఈ పార్టీలు మరోసారి ఆలోచిస్తారని అంటున్నారు. ఏదీ ఏమైనా త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.