Begin typing your search above and press return to search.

టీడీపీకి మ‌రో దెబ్బ‌!... వైసీపీలోకి ఎస్పీవై రెడ్డి?

By:  Tupaki Desk   |   7 March 2019 10:31 AM GMT
టీడీపీకి మ‌రో దెబ్బ‌!... వైసీపీలోకి ఎస్పీవై రెడ్డి?
X
ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎంపీల‌తో పాటు న‌లుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌డంతో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింది. ఈ స్థానాల‌న్ని పార్టీకి కీల‌క స్థానాలే కావ‌డంతో ఇప్పుడు ఆ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను వెతుక్కోవ‌డం, అది కూడా స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ‌డంతో టీడీపీ అయోమ‌యంలో ప‌డిపోయింది. అయితే ఈ త‌ర‌హా ఎదురు దెబ్బ‌లు ఆ పార్టీకి మ‌రిన్ని త‌గ‌ల‌డం ఖాయ‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ వాద‌న క‌రెక్టేన‌ని తాజాగా తేలిపోతున్న‌ట్లుగా స‌మాచారం. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ పైనే నంద్యాల ఎంపీ సీటు నుంచి బ‌రిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి... వైసీపీ మేనియాలోనే నెగ్గేశారు. అయితే ఆ త‌ర్వాత ఎంపీగా లోక్ స‌భ‌లో ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి ముందే... టీడీపీలో చేరిపోయారు. నాడు అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన టీడీపీ చేసిన బెదిరింపుల కార‌ణంగానే ఎస్పీవై చేసేది లేక అధికార పార్టీలో చేరిపోయార‌ని నాడు వార్త‌లు వినిపించాయి. అయితే ఇదంతా గ‌తం అనుకుంటే... ఇప్పుడు స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు తాను సిట్టింగ్ గా ఉన్న నంద్యాల సీటును త‌న‌కే ఇవ్వాల‌ని ఎస్పీవై రెడ్డి... చంద్ర‌బాబును కోరార‌ట‌. అయితే అందుకు ఓ వింత కండీష‌న్ పెట్టిన చంద్ర‌బాబు... టికెట్ కావాలంటే... నూ.60 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ చూపించ‌మ‌న్నార‌ట‌. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఎస్పీవై రెడ్డి... టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ట‌. ఈ మేర‌కు ఈ నెల 10న త‌న కార్యక‌ర్త‌ల‌తో భేటీ కావాల‌ని, ఆ భేటీలోనే త‌న భ‌విష్య‌త్తు వ్యూహాన్ని ఖ‌రారు చేసుకోవాల‌ని ఆయ‌న గ‌ట్టిగానే నిర్ణ‌యించుకున్నార‌ట‌.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు టీడీపీకి రాజీనామా చేయ‌నున్న ఎస్పీవై రెడ్డి... నేరుగా వైసీపీలోనే చేర‌తార‌ని తెలుస్తోంది. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీకి తాను చేసిన ద్రోహంతో ఈ ద‌ఫా త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన ఎస్పీవై.... టికెట్ ద‌క్క‌క‌పోయినా... వైసీపీలో చేరితే గౌవ‌రంగానైనా ఉంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి ఎస్పీవై రెడ్డి ప్ర‌తిపాద‌న‌కు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏమంటారో చూడాలి. ఇదిలా ఉంటే... స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు నంద్యాల వంటి కీల‌క ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిన అభ్య‌ర్థి రాజీనామా చేస్తే... టీడీపీ ప‌రిస్థితి ఏమిటి? వైసీపీలో ఈ సీటుకు భారీగానే పోటీ ఉన్నా... టీడీపీలో మాత్రం ఈ సీటు నుంచి బ‌రిలోకి దిగుతామంటూ ముందుకు వ‌స్తున్న ప‌రిస్థితి అయితే లేదు. మ‌రి ఎస్పీవై రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే... నంద్యాల‌లో ఆ పార్టికి దిక్కెవ‌ర‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.