Begin typing your search above and press return to search.

శ్రీలంక ఈజ్ ఫ‌ర్ సేల్‌?

By:  Tupaki Desk   |   16 April 2022 5:28 AM GMT
శ్రీలంక ఈజ్ ఫ‌ర్ సేల్‌?
X
రండి బాబు రండి.. ఇదే మంచి త‌రుణం.. ఇంత‌కంటే మంచి అవ‌కాశం మ‌ళ్లీ రాదు.. శ్రీలంక దేశాన్ని కొనేసి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆదుకోండి.. ఇదీ ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రైన ఎలాన్ మ‌స్క్‌కు నెటిజ‌న్లు చేస్తున్న విజ్ఞ‌ప్తి. ప్ర‌జాద‌ర‌ణ పొందిన సామాజిక మాధ్య‌మ‌మైన ట్విట‌ర్‌ను కొనుగోలు చేసేందుకు మ‌స్క్ భారీ ఆఫ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ డ‌బ్బుతో శ్రీలంక‌ను ఆదుకోవాలని ఆయ‌న్ని కోరుతూ ప్ర‌జ‌లు ట్వీట్లు చేస్తున్నారు.

టెస్లా సీఈవో ఎలాన్ మ‌స్క్ 43 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ప్ర‌ముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట‌ర్‌ను కొనుగోలు చేస్తాన‌ని బంప‌రాఫ‌ర్ ఇచ్చారు. ఇప్ప‌టికే ట్విట‌ర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న ఆయ‌న మిగిలిన వాటాల‌నూ కొనుగోలు చేస్తాన‌ని ప్ర‌తిపాదించారు. ఒక్కో ట్విట‌ర్ షేర్‌ను 54.20 డాల‌ర్ల చొప్పున కొంటాన‌ని.. అందుకు మొత్తం 43 బిలియ‌న్ డాల‌ర్లుకు పైగా చెల్లిస్తాన‌ని పేర్కొన్నారు. మ‌న రూపాయ‌ల్లో అది దాదాపు రూ.3.22 ల‌క్ష‌ల కోట్ల‌కు స‌మానం. ఇటీవ‌ల ట్విట‌ర్‌లో ఆయ‌న 9.2 శాతం వాటా కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఎలాన్ మ‌స్క్ ప్ర‌తిపాద‌న గురించి ఆలోచిస్తున్న‌ట్లు ట్విట‌ర్ తెలిపింది. మ‌రోవైపు ట్విట‌ర్‌ను కొనే బ‌దులు అదే డ‌బ్బుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక‌ను ఆదుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ప్ర‌ముఖులు సైతం ఇలాగే ట్వీట్ చేస్తున్నారు. ట్విట‌ర్ను సొంతం చేసుకోవ‌డం కోసం మ‌స్క్ ప్ర‌తిపాదించిన మొత్తం 43 బిల‌య‌న్ డాల‌ర్లు.

శ్రీలంక దేశ అప్పు 45 బిలియ‌న్ డాల‌ర్లు. ఆయ‌న శ్రీలంక‌ను కొనుగోలు చేసి సిలోన్ మ‌స్క్‌గా త‌న పేరు మార్చుకోవ‌చ్చు క‌దా అని స్పాప్‌డీల్ సీఈవో కునాల్ ట్వీట్ చేశారు. 43 బిలియ‌న్ డాల‌ర్ల‌కు మ‌రో 8 బిలియ‌న్ డాల‌ర్లు జ‌త‌చేసి శ్రీలంక అప్పు తీర్చి దాని పేరును సిలోన్ మ‌స్క్‌గా మార్చుకోవ‌చ్చు అంటూ నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు.

శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స కుటుంబ రాజ‌కీయాల వ‌ల్ల దేశం రుణం ఊబిలో కూరుకుపోయింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడా దేశంలో నిత్య‌వ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకాయి.

ఓ ద‌శ‌లో ఎమ‌ర్జెన్సీ విధించిన రాజ‌ప‌క్క ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ల కార‌ణంగా దాన్ని ఎత్తేశారు. ఇప్ప‌టికీ దేశాధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు రోడ్ల‌పై నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు అధికార పార్టీ కేబినేట్ మంత్రులు రాజీనామాలు చేయ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది.