Begin typing your search above and press return to search.

మోసం చేస్తోంది కేంద్రమా ? రాష్ట్రాలా ?

By:  Tupaki Desk   |   28 April 2022 10:30 AM GMT
మోసం చేస్తోంది కేంద్రమా ? రాష్ట్రాలా ?
X
ఇపుడిదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రాలు తీసుకోవాల్సిన, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులందరితో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే కరోనా సమస్యలపైనే కాకుండా హఠాత్తుగా పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో కొన్ని రాష్ట్రాలు ప్రజలను మోసం చేస్తున్నట్లు విరుచుకుపడ్డారు.

కరోనా సమస్యపై మోడీతో వీడియో కాన్ఫరెన్స్ కారణంగా ముఖ్యమంత్రులు కేవలం కరోనా సమస్యపైన మాత్రమే సమాచారంతో కాన్ఫరెన్స్ కు సిద్ధమయ్యారు. కానీ హఠాత్తుగా పెట్రోలు, డీజిల్ ధరల తగ్గించటంపైన కూడా మోడీ ఆరోపణలతో విరుచుకుపడటం తో అందరూ ఆశ్చర్యపోయారు.

పైగా పెట్రోల్, డీజల్ ధరల తగ్గింపులో కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించినా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోవటంతోనే ధరలు పెరిగిపోతున్నాయంటు ఆరోపించారు. రాష్ట్రాలు ధరలు తగ్గించకుండా జనాలను మోసం చేస్తున్నాయనటమే ఆశ్చర్యంగా ఉంది.

అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నపుడు కేంద్రం ధరలు ఏరోజూ తగ్గించలేదు. ఇదే సమయంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నపుడు మాత్రం దాని కారణంగా ఇక్కడ ధరలు పెంచేస్తోంది. నిజానికి ధరలను ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటు వెళుతున్న కేంద్రమే జనాలను మోసం చేస్తోంది. తాను పెంచుకుంటున్నదంతా పెంచేసి, సంపాదించినంత సంపాదించేసుకుని ఇపుడు సంపాదించుకున్నది చాలు ధరలు తగ్గించమని మోడీ సీఎంలకు చెప్పటమే విచిత్రంగా ఉంది.

ఇదే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ హయాంలో ధరలు పెరిగిపోతున్నాయంటు ఢిల్లీలో నానా రచ్చ చేశారు. అప్పటితో పోల్చుకుంటే మోదీ హయాంలో ధరలు నూరుశాతం పెరిగిపోయాయి. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎంతగా ప్రశ్నిస్తున్నా మోడి సమాధానం చెప్పడంలేదు.

ఇదే విషయమై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా, మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ మాట్లాడుతూ మోడిపై విరుచుకుపడ్డారు. ప్రజలను మోసం చేస్తున్నది మోడీయే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కావటంటు ఘాటుగా స్పందించారు. దేశంలో సంక్షోభం ముదిరినప్పుడల్లా పరిష్కరించలేక ఆ నెపాన్ని మోడీ రాష్ట్రాలపై మోపుతున్నట్లు మమత విరుచుకుపడ్డారు.