Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా.!?

By:  Tupaki Desk   |   3 July 2019 9:38 AM GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సుజనా.!?
X
ఏమో గుర్రం ఎగురావచ్చు.. దాదాపు ఏపీలో చచ్చిపోయిన బీజేపీ వలసవచ్చిన టీడీపీ, కాంగ్రెస్ ఇతర నేతలతో లేవనూ వచ్చు. జాతీయ వాదం పేరిట అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకుంటున్న బీజేపీకి ఏపీ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది. దేశంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవని రాష్ట్రంగా ఏపీ ఉంది. పైగా తమను గద్దెదించడానికి ప్రయత్నించిన ప్రత్యర్థి చంద్రబాబు ఓడిపోయి అష్టకష్టాలు పడుతున్నాడు.

అందుకే ఇప్పుడు ఆపరేషన్ టీడీపీని చేపట్టింది బీజేపీ. ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ తో జట్టు కట్టి ప్రాంతీయ పార్టీలతో కూటమి పెట్టి బీజేపీని గద్దెదించాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమితో వెనుదిరిగి చూడడం లేదు. అయితే ఎన్నికల్లో దెబ్బతిన్న టీడీపీని మరింత దెబ్బతీసి ఆ పార్టీని ఏపీలో లేకుండా చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది.

ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ ఇక్కడే తిష్టవేసి ఏపీ టీడీపీ నేతలకు వలవేస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను లాగేశారు. ఎమ్మెల్యేలను లాగేయడానికి సిద్ధం అవుతున్నారు.

అయితే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అంత దూకుడుగా ముందుకెల్లడం లేదు. అందుకే ఆయనను మార్చడానికి బీజేపీ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కన్నా ప్లేసులో ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారన్న వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాబు మొన్నటివరకు నమ్మిన సుజనానే ఆయనపై పోటీగా దింపాలని బీజేపీ యోచిస్తోందట.. పక్కా బిజినెస్ మ్యాన్ అయిన సుజనా దీనికి ఒప్పుకుంటారా.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని రాష్ట్రంలో లీడ్ చేస్తారా అన్నది వేచిచూడాలి.