Begin typing your search above and press return to search.

కీలకమైన జిల్లాలో టీడీపీకి గట్టి అభ్యర్థుల కొరత ఉందా?

By:  Tupaki Desk   |   20 Dec 2022 2:30 AM GMT
కీలకమైన జిల్లాలో టీడీపీకి గట్టి అభ్యర్థుల కొరత ఉందా?
X
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు సక్సెస్‌ కావడంతో టీడీపీలో మంచి జోష్‌ నెలకొంది. మహానాడు తర్వాత నిర్వహించిన మినీ మహానాడు, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మనకు వంటి కార్యక్రమాలు సైతం విజయవంతమయ్యాయి.

కాగా టీడీపీకి కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలున్నాయి. టీడీపీకి కొమ్ము కాస్తున్న ఓ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉంది. అయినప్పటికీ ఈ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి అభ్యర్థులే లేరని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా గత ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీతో అంటకాగుతున్నారు. దీంతో గన్నవరంలో సరైన అభ్యర్థిని ఇంతవరకు పెట్టలేకపోయిందని అంటున్నారు. ఇక తమకు ఏకుకు మేకులా మారిన గుడివాడలో కొడాలి నానిని ఓడించడానికి ఓడించడానికి కూడా టీడీపీకి అభ్యర్థి లేరని చెబుతున్నారు. ప్రస్తుతం రావి వెంకటేశ్వరరావు ఉన్నా కొడాలి నానితో పోలిస్తే అంత గట్టి అభ్యర్థి కాదనే చర్చ జరుగుతోంది.

అదేవిధంగా తిరువూరు, నందిగామ తదితర నియోజకవర్గాల్లోనూ సమస్య ఉందని అంటున్నారు. విజయవాడ తూర్పులో ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దె రామ్మోహన్‌ను ఈసారి విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేయించాలనే ఉద్దేశంలో టీడీపీ అధిష్టానం ఉందని అంటున్నారు. అలాంటప్పుడు విజయవాడ తూర్పులోనూ అభ్యర్థికి కొరత ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా మైలవరంలో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును గన్నవరం నుంచి పోటీ చేయించే ఆలోచన ఉందని అంటున్నారు. అప్పుడు మళ్లీ మైలవరంలో అభ్యర్థికి కొరత ఉంటుందని వివరిస్తున్నారు.

ఇక జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఉన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ఈయన తగిన అభ్యర్థి కాదనే చర్చ జరుగుతోంది. అలాగే నందిగామలో తంగిరాల సౌమ్య టీడీపీ తరఫున ఉన్నప్పటికీ ఆమె కూడా వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుకు ఎంతవరకు పోటీ ఇవ్వగలరనే దానిపై అనుమానాలున్నాయి.

ఈ నేపథ్యంలో కీలకమైన కృష్ణా జిల్లాలో టీడీపీకి మరింత గట్టి అభ్యర్థులు అవసరమనే చర్చ జరుగుతోంది. దూకుడు, అంగ బలం, అర్థ బలం లేకపోతే వైసీపీ దూకుడుని అడ్డుకోవడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. అయితే జనసేన–టీడీపీ కూటమితో రంగంలోకి దిగితే మెజారిటీ సీట్లను జనసేన-టీడీపీ కూటమి గెలుచుకుంటుందనే భావన వ్యక్తమవుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.