Begin typing your search above and press return to search.

ఇలా అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గంపైన టీడీపీ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   5 Sep 2022 11:30 PM GMT
ఇలా అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గంపైన టీడీపీ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అత్యంత బ‌లంగా ఉన్న జిల్లాల్లో గుంటూరు జిల్లా ఒక‌టి. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం అత్య‌ధికంగా ఉన్న జిల్లాల్లో గుంటూరు కూడా ఒక‌టి. అంతేకాకుండా రాష్ట్రంలోనే అత్య‌ధికంగా తూర్పుగోదావ‌రి జిల్లా (19) త‌ర్వాత గుంటూరు జిల్లాలోనే ఎక్కువ‌గా 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్ల‌మెంటు సీట్లు కూడా అత్య‌ధికంగా తూర్పుగోదావ‌రితోపాటు ఈ జిల్లాలోనే మూడు ఉన్నాయి. అంతేకాకుండా రాజ‌ధాని అమ‌రావ‌తి కూడా గుంటూరు జిల్లాలోనే నెల‌కొని ఉంది. అంత కీల‌క‌మైన జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి రేప‌ల్లె, గుంటూరు ప‌శ్చిమ సీట్లు మాత్ర‌మే ల‌భించాయి. మిగిలిన చోట్ల ఓట‌మిపాలైంది.

అయితే ఈసారి మాత్రం గుంటూరు జిల్లాలో మెజారిటీ సీట్ల‌ను కొల్ల‌గొట్టాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ ఉంది. అయితే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు, అభిప్రాయ భేదాలు ఆ పార్టీ అధిష్టానానికి శిరోభారంగా మారాయ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నేత‌ల మ‌ధ్య అభిప్రాయ భేదాల‌తో ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అంటున్నారు.

స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీకి చెందిన అంబ‌టి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి చెందిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావుపై గెలుపొందారు. 2014లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన అంబ‌టి.. కోడెల‌పై స్వ‌ల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అయితే 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చాక కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ప్ర‌స్తుతం టీడీపీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజ‌నేయులు, కోడెల ప్ర‌సాద‌రావు కుమారుడు కోడెల శివ‌రామ్, తెలుగు యువ‌త నేత మ‌ల్లి టీడీపీ త‌ర‌ఫున ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే.. వీరి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని టాక్ న‌డుస్తోంది. కోడెల శివ‌రామ్‌పై అనేక కేసులు న‌మోదై ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డట్టు శివ‌రామ్‌పై అభియోగాలు ఉన్నాయి.

ఇక మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజ‌నేయులు, తెలుగు యువ‌త నేత మ‌ల్లి మ‌ధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలో వీరిద్ద‌రూ వేర్వేరుగా అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌డం వివాదానికి తావిచ్చింది. ఇంత‌కుముందే సత్తెనపల్లి టీడీపీలో లుకలుకలు కొనసాగుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ విషయం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్ల‌డంతో అందరు కలిసి కట్టుగా ముందుకు సాగాలని పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆదేశాలిచ్చారు.

అయితే అధిష్టానం ఆదేశాలను నేతలు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నార‌ని స‌మాచారం. వర్గాల వారీగా అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తున్నార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగు యువత నేత మల్లి ఆధ్వర్యంలో సెప్టెంబ‌ర్ 4 అన్న క్యాంటీన్ ప్రారంభమైంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 5న సోమ‌వారం మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీంతో వివాదం కొన‌సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.