Begin typing your search above and press return to search.

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు !

By:  Tupaki Desk   |   6 Jun 2020 5:15 AM GMT
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు !
X
వీఆర్వో వ్యవస్థ రద్దు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలు సందర్భాల్లో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్తూవస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీ వేయగా.. వీఆర్వోలు ఉండాల్సిందేనని తెలిపింది. కమిటీ సూచనల మేరకు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమయంలో తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి వీఆర్వో వ్యవస్థ రద్దు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది.

పల్లెప్రగతి, నియంత్రిగ సాగు విధానంపై జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పల గ్రామంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల గురించి మంత్రి మాట్లాడుతూ .. రైతుల పేర్లు భూముల రికార్డుల్లోకి ఎక్కడం లేదు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందడం లేదు. దీంతో వారు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు పొందలేక నష్టపోతున్నారు. దీనికి గ్రామ రెవెన్యూ అధికారులే (వీఆర్వోలు) కారణం. అందుకే ఈ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు

రఘునందన్ రావు కమిటీ నివేదిక ఆధారంగా రెవెన్యూశాఖ పునర్ వ్యవస్థీకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి వీఆర్వో వ్యవస్థను రద్దు చేయబోతున్నామని బహిరంగ సభలో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామంలో రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి.. వ్యవసాయశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేస్తారనే చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీఆర్వోల గురించి కలెక్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్‌లోనూ సీఎం కేసీఆర్ వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే వీఆర్వో వ్యవస్థ ప్రక్షాళన చేస్తారా.. లేదంటే రద్దు చేస్తారనే అంశం మరోసారి చర్చకు దారితీసింది.