Begin typing your search above and press return to search.

మోడీలో టెన్షన్ పెరిగిపోతోందా ?

By:  Tupaki Desk   |   16 Dec 2021 6:15 AM GMT
మోడీలో టెన్షన్ పెరిగిపోతోందా ?
X
వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా తన ఇంట్లో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున ఎక్కువ మంది ఎంపీలు గెలవటం ఎంత ముఖ్యమో వాళ్ళందరికీ గుర్తుచేశారు. ఇప్పటివరకు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన పార్టీ దక్షిణాదిలో కూడా విస్తరించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారట. రాబోయే ఎన్నికలే పార్టీకి చాలా కీలకమని కూడా చెప్పారు.

అంటే ఇదంతా చూస్తుంటే మోడీలో పెరిగిపోతున్న టెన్షన్ కు నిదర్శనంగా అనిపిస్తోంది. ఎందుకంటే మోడీ ఏనాడు ఇలాగ ఎంపీలతో భేటీ అయ్యిందిలేదు. పార్టీ గెలవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది లేదు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా ఎంపీలతో సమావేశమవ్వటం, గెలుపు అవసరాన్ని గుర్తు చేయటమంటే టెన్షన్ పడుతున్నట్లే అనుకోవాలి. ఉత్తరాధిలో మోడీ వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.

తొందరలోనే జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా ఏమిటో తేలిపోతుంది. ఇప్పటికైతే పంజాబ్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేవని అర్ధమైపోయింది. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా బాగా వ్యతిరేకత కనబడుతోంది. యూపీ అసెంబ్లీలో గనుక పార్టీ అధికారంలోకి రాకపోతే అంతేసంగుతులు. దీని ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లో పడటం ఖాయమని మోడీకి అర్ధమైపోయింది.

అందుకనే ఉత్తరాధిలో దెబ్బతిన్నా కనీసం దక్షిణాదిలో అయినా పార్లమెంటు సీట్లు తెచ్చుకుంటే మళ్ళీ అధికారంలోకి రావచ్చనే ఆశలో ఉన్నట్లున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దక్షిణాదిలో కర్నాటకలో తప్ప ఇంకెక్కడా బీజేపీ ఊసేలేదు. తెలంగాణలో మాత్రం నలుగురు ఎంపీలున్నారంతే. ఈ నలుగురు ఎంపీలు తిరిగి గెలిస్తే అదే పదివేలన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఇక కేరళ, తమిళనాడు, ఏపీలో చెప్పుకునే అవసరం కూడా లేదు.

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు, బీజేపీ నేతల బలం మోడీకి బాగా తెలుసు. అందుకనే ఇతర పార్టీల నుండి నేతలను తీసుకొచ్చైనా సరే ఎంపీ సీట్లు గెలుచుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్పేశారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలసలను ప్రోత్సహించమని స్వయంగా మోడీనే చెప్పారంటేనే పరిస్దితి ఎంత ఇబ్బందిగా అర్ధమైపోతోంది. ఎంతమంది వలస నేతలు వచ్చినా ఏపీలో మాత్రం కనీసం డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు కనిపించటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.