Begin typing your search above and press return to search.

థాక్రే ఆధిపత్యం అంతమైనట్లేనా ?

By:  Tupaki Desk   |   1 July 2022 7:30 AM GMT
థాక్రే ఆధిపత్యం అంతమైనట్లేనా ?
X
మహారాష్ట్రలో శివసేన పార్టీకి ఉన్న ప్రాబల్యం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శివసేనంటే థాక్రే, థాక్రేలంటే శివసేన అన్నట్లుగా దశాబ్దాల తరబడి రాజకీయం సాగింది. అవతల ఎంత పెద్ద పార్టీ అయినా కేంద్రంలో అధికారంలో ఉన్నా సరే ముంబాయ్ లో మాత్రం దాని ఆటలు సాగేవికాదు. మహారాష్ట్రలో ప్రత్యేకించి ముంబయ్ లోకి అడుగుపెట్టాలంటే థాక్రేల మద్దతు లేకపోతే ఏపనీ సజావుగా సాగదు. రాజకీయంగా అంతటి బలమైన శివసేన తొందరలో థాక్రేల చేతుల్లో నుండి జారిపోతోందా ?

తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిజానికి బాలాసాహెబ్ థాక్రే మరణంతోనే శివసేనకు బీటలు పడింది. థాక్రే వారసత్వం తనకు వస్తుందని మేనల్లుడు రాజ్ థాక్రే ఆశించారు.

ఎందుకంటే బాలాసాహెబ్ ఉన్నపుడు కూడా ఆయన తరపున మొత్తం వ్యవహారాలను రాజ్ థాక్రేయే చేసేవారు. అలాంటిది ఆయన చనిపోయేముందు హఠాత్తుగా కొడుకు ఉధ్ధవ్ థాక్రే చేతిలో పగ్గాలు పెట్టారు.

దాంతో బాలాసాహెబ్ చనిపోగానే మేనల్లుడు పార్టీని చీల్చి వేరు కుంపటి పెటుకున్నారు. నిజానికి రాజ్ థాక్రేతో పోల్చుకుంటే ఉద్థవ్ అంత గట్టి నేత కారని అందరికీ తెలుసు. కేవలం వారసత్వమే ఏకైక అర్హతగా ఉద్ధవ్ తెరమీదకు వచ్చారు. అలాంటి ఉద్థవ్ ను ఇపుడు ఏక్ నాథ్ షిండే పూర్తి దెబ్బ కొట్టేశారు.

తమదే అసలైన శివసేనగా షిండే చెప్పుకుంటున్నారు. 70 శాతం చీల్చిన వారిదే పార్టీ. మరి లీగల్ గా ఎంతవరకు వెళ్తుందో తెలియదు గాని రేపు విశ్వాస బలపరీక్ష సమయంలో విప్ జారీ చేస్తారు. దాంతో షిండే నాయకత్వంలో ఉండే ఎంఎల్ఏలే కాదు ఉద్ధవ్ తో ఉన్న వాళ్ళు కూడా షిండేకే ఓట్లేయాల్సిన పరిస్థితి. వేయకపోతే ఏమవుతుందన్నది వేచి చూడాలి.

అయితే షిండేకి వెలుపలి శక్తులు చాలా బలంగా మద్దతిస్తున్నాయి. దాంతో షిండే వర్గానిదే శివసేన అని తేలిపోయే అవకాశం ఉంది. అప్పుడు థాక్రే ఏమిచేస్తారు ? కొత్తగా మరో పార్టీ పెట్టుకుని నిర్మించి పటిష్టం చేసేంత సీన్ ఉద్ధవ్ కు లేదు. కాబట్టి జరుగుతున్నది చూస్తు కూర్చోవటం ఒకటే మార్గం. లేదంటే జరగబోయేదాన్ని కాలానికి వదిలేయటమే. మొత్తానికి ముఖ్యమంత్రి కుర్చీని లాగేసుకున్న షిండే తొందరలో పార్టీని కూడా లాగేసుకోబోతున్నారు.