Begin typing your search above and press return to search.

ఆ చానల్ ఉత్సాహం.. బీజేపీని సేవ్ చేసిందా?

By:  Tupaki Desk   |   28 Oct 2022 3:52 AM GMT
ఆ చానల్ ఉత్సాహం.. బీజేపీని సేవ్ చేసిందా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ సంచలనంగా మారి.. అందరూ మాట్లాడుకునేలా చేసింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎర వేయటం. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తూ.. మొత్తం రూ.400 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లుగా చెప్పిన ఉదంతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. బుధవారం రాత్రి బయటకు వచ్చిన ఈ ఉదంతం గురువారం కాస్తంత చప్పగా మారినట్లు చెప్పొచ్చు.

ఈ ఉదంతానికి సంబంధించిన కీలక పరిణామాలు గురువారం చోటు చేసుకుంటాయని చెప్పినప్పటికీ.. అలాంటివేమీ చోటు చేసుకోకపోవటం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని భావించినా.. అది కూడా వాయిదా పడింది. దీనికి తోడు మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేస్తూ.. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున దీనిపై టీఆర్ఎస్ నాయకులు ఎవరూ మాట్లాడొద్దని.. బీజేపీ నేతలు వాగుతూనే ఉంటారని.. పట్టించుకోవద్దని చెప్పటం ఆసక్తికరంగా మారింది.

ఏదో జరిగిపోతుందన్న భావన నుంచి అసలేమీ జరగకపోవటాన్ని చూసిన పలువురు.. కేసీఆర్ తుస్ అనిపించారే అన్న మాట వినిపించింది. అయితే.. ఇలాంటి ఉదంతాల్లో కేసీఆర్ మైండ్ గేమ్ మిగిలిన వారికి భిన్నంగా ఉంటుందన్న వాదనను రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన ఒక కీలక వాదన కొత్తగా వినిపిస్తోంది.

ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేయటం.. ఆ విషయం కేసీఆర్ కు తెలియటం.. దాన్ని తిప్పి కొట్టేందుకు.. ఎర వేసిన కమలనాథులకు కరెంటు షాక్ కొట్టేలా కేసీఆర్ వ్యూహాన్ని సిద్ధం చేయటం.. దానికి సంబంధించిన ప్లానింగ్ ప్రగతిభవన్ లో చోటు చేసుకోవటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే.. ఫామ్ హౌస్ లోని ప్రత్యేకంగా సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయటం.. ఆడియో రికార్డర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

బీజేపీ మధ్యవర్తులు ఫామ్ హౌస్ లోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు గంటల పాటు వారి మాటలకు సంబంధించిన ఫుటేజ్ ఉందని.. అందులో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఎలా పడగొట్టిన వైనం.. అందులో తమ పాత్ర గురించి మధ్యవర్తులు గొప్పలు చెప్పుకోవటం క్లియర్ గా రికార్డు అయినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ తీర్థం తీసుకోవటానికి వీలుగా డీల్ కు ఓకే చెబుతున్న గులాబీ ఎమ్మెల్యేలతో బీజేపీ నెంబర్ 2 చేత ఫోన్లో నేరుగా మాట్లాడించే ఎపిసోడ్ ను సైతం రికార్డు చేయటానికి ప్లానింగ్ జరిగిందని చెబుతున్నారు.

పలుమార్లు సదరు ముఖ్యనేత వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేయటం.. ఆయన్ను లైన్లోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ.. అది కుదర్లేదంటున్నారు. ఈ కారణంగానే ఫామ్ హౌస్ లో మధ్యవర్తులు చాలాసేపు ఉండిపోయారంటున్నారు. అయితే.. ఈ ఎపిసోడ్ గురించి కాస్తంత వివరాల్ని సేకరించిన ఒక తెలుగు చానల్.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్రేకింగ్స్ వేయటంతో.. ఒక్కసారిగా అందరూ అలెర్టు అయిపోయినట్లుగా చెబుతున్నారు.

ఒకవేళ.. సదరు చానల్ కాస్తంత ఓపిక పట్టినా.. బ్రేకింగ్స్ వేయటంలో కాస్తంత ఆలస్యాన్ని చూపించినా.. బీజేపీ టాప్ 2 నేత ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. సదరు చానల్ హడావుడి బీజేపీని భారీగా సేవ్ చేసిందన్న మాట వినిపిస్తోంది. ఇదెంతవరకు నిజమన్నది రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు.. బయటకు వస్తాయంటున్న వీడియో ఫుటేజ్ లు స్పష్టం చేస్తాయంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.