Begin typing your search above and press return to search.

ఇంతకీ జిన్నా విలనేనా...?

By:  Tupaki Desk   |   1 Jan 2022 10:30 AM GMT
ఇంతకీ జిన్నా విలనేనా...?
X
మహమ్మద్ ఆలీ జిన్నా. ఈ పేరు చెప్పగానే సగటు భారతీయుడికి కలిగే భావన ఏంటి అంటే ఆయన భారత్ ని ముక్కలు చేశారు అని. ఆయన వల్లనే అఖండ భారత్ రెండుగా చీలిపోయింది అని. అయితే అది అర్ధ సత్యమే తప్ప్ పూర్తి నిజం కాదని చరిత్ర పుటలను ఒకసారి తడిమితే అర్ధమవుతుంది. ఒక కాగితం రెండు ముక్కలు కావడానికి రెండు వైపులా బలం ఉపయోగపడుతుంది కదా. ఇదే సహజ న్యాయం భారత్ విభజన విషయంలోనూ జరిగింది అనుకోవడంలో తప్పేముంది.

జిన్నా జీవిత చరిత్ర ఒకసారి పరికిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. జిన్నా గొప్ప సమైక్యవాదిగా మొదట్లో ఉండేవారని చరిత్ర చెబుతోంది. అంటే ఆయనకు అఖండ భారత్ మీద మమకారం ఉండేదని తెలుస్తుంది. ఇక ఆయన హిందూ ముస్లింస్ ఐక్యతను కూడా గట్టిగా కోరుకున్నాడని కూడా చరిత్రలో చూస్తే అర్ధమవుతుంది. ఆయన తొట్ట తొలిగా రాజకీయ అరంగేట్రం చేసింది భారతీ జాతీయ కాంగ్రెస్ ద్వారానే. ఆ పార్టీ తరఫున ఆయన చాలా ఏళ్ళు దేశం కోసం పనిచేసారు.

భారత్ కి స్వాతంత్రం రావాలని ఏకతా అఖండత తుదిదాకా వర్ధిల్లాలని కోరుకున్నారని చరిత్రను చూస్తే తెలుస్తుంది. ఇక ఆయన గాంధీ, గోపాల క్రిష్ణ గోఖలే, నౌరోజీ, తిలక్ వంటి వారితో పనిచేశారు. అదే విధంగా హిందూ ముస్లిం లు కలసి బ్రిటిష్ వారి మీద పోరాడాలని కోరుకున్నారు. ఇదిలా ఉంటే తరువాత జరిగిన పరిణామాలు, నాటి జాతీయ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న ఘటనలు, నేతల మధ్య వచ్చిన విభేదాలు బ్రిటిష్ వారికి బాగా కలసి వచ్చాయని అంటారు.

ఆ విధంగా బ్రిటిష్ వారి వ్యూహంలో జిన్నా పావుగా మారారని అంటారు. హిందూ ముస్లిం ల మధ్య సయోధ్య ఉంటే అఖండ భారతాన్ని విడగొట్టకపోతే ఎప్పటికైనా ఇబ్బందే అని తలచిన బ్రిటిష్ వారి వ్యూహంలో జిన్నా తరువాత రోజుల్లో అంటే 1930 ప్రాంతం తరువాత చిక్కుకున్నారని తెలుస్తుంది. ఆ మీదటనే ఆయన లాహోర్ లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సమావేశంలో ప్రత్యేక దేశం కావాలని పట్టుపడుతూ తీర్మానం ఆమోదించారు.

చివరికి ఏమీ కాని చోట. అసలు ఏ విధంగాను సఫలం కాదనుకున్న చోట పాకిస్థాన్ పేరిట ఒక దేశాన్ని సృష్టించి జిన్నా ఆ దేశానికి జాతిపితగా మారారు. ఇంత చేసినా జిన్నా పాకిస్థాన్ కి పాలించింది కేవలం 13 నెలలు మాత్రమే అన్నది ఇక్కడ గుర్తుంచుకోవాలి. 1947 ఆగస్ట్ 14 అంటే మనకంటే ఒక రోజు ముందుగా పాకిస్థాన్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. నాటి నుంచి 1948 సెప్టెంబర్ 11న అంటే పదమూడు నెలలు మాత్రమే జిన్నా పాకిస్థాన్ ఏలికగా నిలిచారు.

ఆయన ఆ దేశానికి గొప్ప నేతగా ఈ రోజుకీ కీర్తించబడుతున్నారు. ఇక జిన్నా పూర్వీకులది గుజరాత్ అంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఆయన తల్లిదండ్రులు గుజరాత్ లోని పనేలీకి చెందిన వారు. ఈ పనేలీ ఎక్కడ ఉంది అంటే మన మహాత్ముడు గాంధీ పుట్టిన పోరుబంధర్ కి సమీపంలోనే. ఇక జిన్నా తల్లిదండ్రులు వ్యాపార నిమిత్తం కరాచీకి వెళ్ళారు. అక్కడ 1876లో జిన్నా పుట్టారు.

మరో చిత్రం ఇక్కడ చెప్పుకోవాలి. జిన్నాకు పాకిస్థాన్ అధికార భాష ఉర్దూ రాదు. ఆయన గుజరాతీలోనే మాట్లాడేవారు, దానిలోనే అధికార ప్రత్యుత్తరాలు అన్నీ జరిపేవారు. లండన్ లో బారిష్టర్ చదవడం చేస్త ఇంగ్లీష్ అనర్గళంగా ఆయన మాట్లాడేవారు ఇక జిన్నా ఇరవై ఏళ్లకే బారిష్టర్ పూర్తి చేసుకుని ముంబైలో ప్రాక్టీస్ పెట్టి ఆనాడు ముస్లిం సమాజంలో ఏకైక లాయర్ గా ఉండేవారు. ఆయన ఎక్కువ పారితోషికం కూడా తన వాదనకు తీసుకునేవారు అని చెబుతారు. అదే జిన్నా పాక్ కి పాలకుడిగా కేవలం నెలకు రూపాయి మాత్రమే తీసుకున్నారు.


మొత్తానికి జిన్నా విషయం తీసుకుంటే పరిస్థితులు, అవకాశాలు, బ్రిటిష్ వారి వ్యూహాలు, నాటి కాంగ్రెస్ లోని నేతల ఆలోచనలు అన్నీ కలసి ఆయన్ని వేర్పాటువాదిగా మార్చేశాయి అని చరిత్రని చూస్తే అర్ధమవుతుంది. ఇంత జరిగినా ఆయన హిందువులకు ద్వేషిగా ఎక్కడా లేరని కూడా అంటారు. ఇదిలా ఉంటే ఈ రోజు బీజేపీ నేతలు జిన్నా మీద నిప్ప్పులు చెరుగుతున్నారు. జిన్నా టవర్ వద్దు, పేరు మార్చండి అంటున్నారు. లేకపోతే కూల్చేస్తామని కూడా అంటున్నారు. కానీ అదే బీజేపీకి చెందిన వరిష్ట నేత ఎల్ కే అద్వానీ 2005 జూన్ 4న పాకిస్థాన్ లోని జిన్నా సమాధి వద్ద నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా జిన్నాను లౌకికవాదిగా దేశభక్తుడిగా పేర్కొన్నారు. ఆయన్ని చరిత్ర విలన్ గా మార్చిందని అద్వానీ పేర్కొనడం విశేషం. హిదువులకు జిన్నా వ్యతిరేకి కాదు ఆయన గొప్పవాడు అని అద్వానీయే అన్నాక బీజేపీ నేతలకు ఇపుడు ఆయన దేశ ద్రహిగా ఎలా కనిపిస్తునారో అర్ధం కావడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక జిన్నా పాకిస్థానీ అనుకోవడానికి లేదు, ఆయన పుట్టింది అఖండ భారతంలో 70 ఏళ్ల దాకా జీవించింది కూడా భారతదేశంలోనే. మరి ఆయనను ఏ విధంగా వేరుగా చూడాలి అన్నది కూడా చరిత్ర కారుల నుంచి వస్తున్న ప్రశ్న.

మొత్తానికి చాలా దూరం వెళ్ళిపోయాక కొన్ని నిజాలు అబద్ధాలు అవుతాయి. అసత్యాలు నిజాలు అవుతాయి, కొన్ని అనివార్య ఘటనలు కూడా కొందరిని విలన్లను చేస్తాయి. లేకపోతే లోకమాన్య తిలక్ తో కలసి సమైక్యవాదిగా భారత విముక్తి కోసం కృషి చేసిన జిన్నా 1916లో జరిగిన లక్నో ఒప్పందలోనూ హిందూ ముస్లిం ల ఐక్యత కోసం పాటుపడిన జిన్నా దేశ విభజనకు కారణం అవడం అంటే ఒక విచిత్రమే. దీని వెనక ఎన్ని శక్తులు, ఎందరు వ్యక్తులు ఉన్నారో కూడా చూడాలి. మొత్తానికి జిన్నా బయటకు కనిపించే వారు కాబట్టి ఆయన దేశాన్ని ముక్కలు చేసిన వారిగానే చరిత్ర చెబుతోంది.