Begin typing your search above and press return to search.

క‌డ‌ప టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న నేత ఈయ‌నేనా?

By:  Tupaki Desk   |   1 Sep 2022 6:24 AM GMT
క‌డ‌ప టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న నేత ఈయ‌నేనా?
X
త‌న నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఈసారి త‌న‌ను ఓడించాల‌ని కంక‌ణం కట్టుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆయ‌న సొంత జిల్లాలోనే షాక్ ఇవ్వ‌డానికి టీడీపీ అదినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైఎస్ కుటుంబానికి పెట్ట‌ని కోట‌గా ఉన్న క‌డ‌ప లోక్‌స‌భా నియోజ‌క‌వ‌ర్గంపై చంద్ర‌బాబు దృష్టి సారించార‌ని అంటున్నారు. గ‌త రెండు ప‌ర్యాయాలు (2014, 2019) క‌డ‌ప నుంచి నుంచి వైఎస్ జ‌గ‌న్ బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అంత‌కుముందు కూడా క‌డ‌ప లోక్‌స‌భ సీటు వైఎస్ కుటుంబం చేతుల్లోనే ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ఆయ‌న సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డిలు ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. అంతేకాకుండా 2009, 2012 ఉప ఎన్నిక‌లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌డ‌ప నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లోనే ఆయ‌న‌కు షాక్ ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి పైన ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌, ఆర్థికంగా గ‌ట్టి ద‌మ్మున్న ఆర్.శ్రీనివాసుల‌రెడ్డి (వాసు)ని ఎంపీ అభ్య‌ర్థిగా దించుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆర్.శ్రీనివాసుల‌రెడ్డి ప్ర‌స్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా ఉన్నారు. గతంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటార‌ని, చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌నకు పేరుంది. ఈ నేప‌థ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీకి ఆర్. శ్రీనివాసుల‌రెడ్డే స‌రైన అభ్య‌ర్థి అని చంద్ర‌బాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు.

వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో ఆయ‌న కుటుంబాన్ని రాజ‌కీయంగా నిర్మూలించాలంటే అన్ని విధాలుగా ఆర్థిక బలం, అంగబలం ఉన్న అభ్య‌ర్థి అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు యోచ‌న‌గా ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే అటు అర్థ‌బ‌లం, ఇటు అంగ‌బ‌లం పుష్క‌లంగా ఉన్న‌శ్రీనివాసుల రెడ్డిని క‌డ‌ప ఎంపీగా అభ్య‌ర్థిగా ఎంచుకున్నార‌ని అంటున్నారు.

కాగా క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ 1984లో మాత్ర‌మే గెలుపొందింది. 1996లో గెలుపు అంచుల వ‌ర‌కు వ‌చ్చి ఓడింది. కాగా 2014 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ త‌ర‌ఫున ఆర్.శ్రీనివాసుల‌రెడ్డి పోటీ చేసి అవినాష్ రెడ్డిపై ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఓట్లు వ‌చ్చాయి. అయితే శ్రీనివాసుల రెడ్డిపై వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గెలుపొందారు.

కడప పార్లమెంట్‌ పరిధిలోని పులివెందులతోపాటు అన్ని నియోజకవర్గాల్లో శ్రీనివాసుల రెడ్డికి బంధువర్గాలతోపాటు జనంలో మంచి ఆదరణ ఉంద‌ని అంటున్నారు. అందులోనూ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ప్ర‌ధాన పాత్ర వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డిదేన‌ని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అవినాష్ రెడ్డిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని.. అది ఈసారి త‌మ‌ను గెలిపిస్తుంద‌ని టీడీపీ లెక్క‌లేసుకుంటోంది. మ‌రోవైపు జ‌గ‌న్.. వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎంపీ అభ్య‌ర్థిగా త‌ప్పించి జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.