Begin typing your search above and press return to search.

డీఎల్ ఫస్ట్రేషన్ వెనుక అసలు సంగతి అదేనా?

By:  Tupaki Desk   |   17 Oct 2021 11:05 AM GMT
డీఎల్ ఫస్ట్రేషన్ వెనుక అసలు సంగతి అదేనా?
X
విశేష రాజకీయ అనుభవం ఉంది.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారు ఇప్పుడు ఏ మాత్రం గుర్తింపు లేనట్లుగా ఉండిపోవటానికి మించిన ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే.. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. తామిప్పుడు మౌనంగా ఉండటానికి మించిన మంచి పని మరేదీ ఉండదన్న విషయం అర్థమైనప్పుడు మౌనంగానే ఉండిపోతారు. కానీ.. పరిస్థితులు చేజారిపోతున్న వేళ.. తమ ఆస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందన్న నమ్మకం వచ్చిన వేళలో మాత్రం ఒక్కసారిగా వారిలో నుంచి పాత మనిషి బయటకు వస్తారు.

తాజాగా కడప జిల్లా వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉందని చెప్పాలి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కామ్ గా ఉన్న ఆయన.. తాజాగా మాత్రం యాక్టివ్ కావటమే కాదు.. దసరా పండుగ వేళ.. సొంత పార్టీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ప్రభుత్వం మీదా.. ప్రభుత్వ సలహాదారు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన సజ్జల మీదా ఘాటు విమర్శలు చేయటమే కాదు.. మంత్రుల మీదా విరుచుకుపడ్డారు.

గతంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన.. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన తర్వాత నుంచి మౌనంగా ఉండటం.. 2014లో తనకు టికెట్ ఇవ్వకున్నా.. పార్టీ టికెట్ తెచ్చుకున్న అభ్యర్థి తరఫున పని చేసి.. అతడి గెలుపులో కీలకభూమిక పోషించిన డీఎల్.. ఇప్పుడు మాత్రం ఎందుకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. డీఎల్ తాజాగా ఎంపిక జరుగుతున్న ఎమ్మెల్సీ తరఫున పదవిని ఆశించారని.. అనంతరం మంత్రి పదవి కూడా వస్తుందని భావించినట్లు చెబుతున్నారు.

తన అంచనాలకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోవటంతో ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను తాను నిరూపించుకోవాలన్న భావన పెరిగిపోయిందని.. ఈ క్రమంలోనే ఆయన బరస్ట్ అయ్యారని చెబుతున్నారు. పండుగ రోజున సంచలన వ్యాఖ్యలు చేస్తే వచ్చే మైలేజీ ఎక్కువగా ఉంటుందని ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు.

తాను ఏ పార్టీలోకి వెళ్లాలన్నది ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పటం ద్వారా.. తానకింకా ఆశ పోలేదన్న సంకేతాన్ని సీఎం జగన్ కు పంపినట్లుగా చెబుతున్నారు. అధినేత నుంచి ఆశించినంత స్పందన వస్తే.. పాత విషయాల్ని వదిలేసి.. ప్రెష్ గా ఉండాలన్న యోచనలో డీఎల్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. ఆయన అనుకున్నట్లుగా సీఎం జగన్ స్పందిస్తారా? అన్నది అసలు ప్రశ్న. డీఎల్ కు ఉండే లెక్కలు ఆయనకు ఉన్నట్లే.. ముఖ్యమంత్రి జగన్ కు ఉండే లెక్కలు ఆయనకు ఉండకుండా ఉంటాయా చెప్పండి?