Begin typing your search above and press return to search.

వైసీపీ భయపడేది దానికేనా...?

By:  Tupaki Desk   |   24 April 2022 3:43 AM GMT
వైసీపీ భయపడేది దానికేనా...?
X
వైసీపీకి రాజకీయాల్లో ప్రత్యర్ధి ఎవరు అంటే ఠక్కున జవాబు చెప్పేశారు. అదే టీడీపీ అని. కానీ అదేమీ కాదు, వైసీపీకి ఆ పార్టీయే శతృవు అని అంటున్నాయి రాజకీయ విశ్లేషణలు. నిజానికి ఒక్క వైసీపీకే కాదు, అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా శతృవులు బయట ఉండరు ఇంట్లోనే ఉంటారు. అదే అధికారం చేసే మ్యాజిక్.

ఇక టీడీపీ అలాంటి ఇలాంటి మెజారిటీతో గెలవలేదు. ఏకంగా ఏపీని ఊడ్చేసింది. అసెంబ్లీలో 175 సీట్లలో 151 ఆ పార్టీకి దక్కాయి. దాంతో ఆశలు ఆశావహులూ పెరిగాయి. వైసీపీకి అదిరిపోయే మెజారిటీ వచ్చిందని పదవులు పెరగవు కదా. మంత్రులు పాతిక మందే ఉండాలి. అందుకే రెండు సార్లు మంత్రి వర్గం కూర్పు మార్పు చేసినా కూడా నలభై ఒక్క మందికే చాన్స్ దక్కింది. మరి మిగిలిన 110 సంగతేంటి. ఆ అసంతృప్తి దావాలనంగా ఉందిట‌.

ఇంకో వైపు తాజా మాజీల ఆవేదన మరో బాధ. ఇవన్నీ కాకుండా ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కూడా పనిచేయని వారున్నారు. వర్గ పోరు ఆధిపత్యాలు ఉన్నాయి. ఇపుడు చూస్తే పార్టీ పటిష్టత పేరిట మూడంచెల వ్యవస్థను తెచ్చారు. ఇందులో జూనియర్లు కొందరికి జిల్లా పీఠాలు దక్కాయి. వారి నాయకత్వాన పనిచేసేది లేదు అని సీనియర్లు అంటున్నారు. ఇక బాగా సీనియర్ అయిన వారికి జిల్లా పీఠాలు ఏ కోశానా సరిపోవడంలేదు.

ఇలా ఏతా వాతా తేలింది ఏంటి అంటే మరిన్ని కొత్త కుంపట్లు రాజుకోవడమే. నామినేటెడ్ పోస్టులు అందుకున్న వారికి అక్కడ నిధులూ విధులూ లేవు. దక్కని వారికీ ఏమీ అసలు లేవు. అసలైన కార్యకర్తలు, జెండా పట్టిన వారికైతే ఈ రోజుకీ న్యాయం జరిగినదీ లేదు. వైసీపీని అమితంగా ఆరాధించిన ఏపీలోని బలమైన సామాజికవర్గంలో గుస్సా చాలా ఎక్కువ అయింది.

ఇలా పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి. మూడేళ్ల పుణ్య కాలం గడచిపోయింది. చాలా తప్పిదాలూ పొరపాట్లూ జరిగిపోయాయి. వాటిని సరిదిద్దే టైమ్ కూడాలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో గట్టిగా కసిగా ఎంతమంది పనిచేస్తారు అన్నది పెద్ద డౌట్. ఒకవేళ వారిని అందరినీ కూడగట్టి ఏకోన్ముఖులను చేసి ఎన్నికల గోదాలోని దింపితే మాత్రం వైసీపీ అక్కడికి సక్సెస్ అయినట్లే.

ఆ మీదట టీడీపీలో అసలైన యుద్ధం ఉంటుంది. మొత్తానికి చూస్తే వైసీపీ అధినాయకత్వం టీడీపీ ని చూసి భయపడడంలేదుట. తమ పార్టీని చూస్తేనే కలత చెందుతోందిట. చూడాలి మరి ఎన్నికల నాటికైనా ఫ్యాన్ రిపేర్లు పూర్తి అవుతాయా.