Begin typing your search above and press return to search.

లక్షన్నర ఉద్యోగాలు అందుకే పోయాయా?

By:  Tupaki Desk   |   4 Jan 2023 9:13 AM GMT
లక్షన్నర ఉద్యోగాలు అందుకే పోయాయా?
X
కోవిడ్‌ భూతం ప్రపంచాన్ని కమ్మేసిన సమయంలో దాదాపు అన్ని సంస్థలు డిజిటల్‌ బాటపట్టాయి. నిత్యావసర సరుకుల కోసం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పై ప్రజలు ఆధారపడ్డారు. అలాగే విద్యార్థులు బైజూస్‌ వంటి ఆన్‌లైన్‌ ఎడ్యు కంపెనీలపై ఆధారపడ్డారు. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లకు, ఆన్‌లైన్‌ ఎడ్యు టెక్‌ కంపెనీలకు బాగా ఆదరణ పెరిగింది. యూట్యూబ్‌ వీడియోలకు సైతం అంతే ఆదరణ దక్కింది.

దీంతో ఎడ్యుటెక్‌ కంపెనీలు, ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లకు సాంకేతిక సేవలు అందించడానికి గూగుల్, అమెజాన్, ఫేసుబుక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్‌ వంటి సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. తమకు వచ్చిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. బైజూస్‌ వంటి స్టార్టప్స్‌ సైతం భారీ ఎత్తున కోవిడ్‌ సమయంలో ఉద్యోగులను నియమించుకున్నాయి.

ఇక 2022 నుంచి కోవిడ్‌ తగ్గుముఖం పట్టింది. మళ్లీ యధావిధిగా కార్యక్రమాలు మొదలయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. షాపులు, మార్కెట్లు తెరుచుకున్నాయి. వర్క్‌ ప్రమ్‌ హోంను విడిచిపెట్టి ఉద్యోగులు కార్యాలయాల బాట పట్టారు. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి.

మరోవైపు పులి మీద పుట్రలా రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ప్రభావాలు, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆయా కంపెనీలకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. వ్యయ నియంత్రణ కోసం టెక్‌ సంస్థలన్నీ తమ 'అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను' వదిలించుకునే పనిలో పడ్డాయి.

ఇలా 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1,013 సంస్థలు 1,53,160 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ లైవ్‌ ట్రాకింగ్‌ సంస్థ బాంబుపేల్చింది. కోవిడ్‌ నుంచి చూస్తే, ఇప్పటివరకు 1,539 సంస్థలు దాదాపు 2,49,151 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. అధిక తొలగింపులు కన్జూమర్, రిటైల్‌ రంగాల్లోనే వెల్లడించింది.

ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ అనంతర పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావాలు, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తదితర కారణాలతో ప్రాజెక్టులు తగ్గిపోయి టెక్‌ కంపెనీలు నష్టాలు చవిచూశాయి. ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తుండటంతో.. సాధ్యమైనంత తొందరగా ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

2022లో మెటా 11,000, అమెజాన్‌ 10,000, సిస్కో 4,100 ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ తెలిపింది. ట్విటర్‌ సిబ్బందిలో దాదాపు 75% మందిని ఎలాన్‌ మస్క్‌ తొలగించారు.

ఇక మనదేశంలో గత ఏడాది కాలంలో పలు స్టార్టప్‌ సంస్థలు దాదాపు 18 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ఇంక్‌.42.కామ్‌ నివేదిక బాంబుపేల్చింది. బైజూస్‌ 2,500, ఓలా 2,300, బ్లింకిట్‌ 1,600, అన్‌ అకాడమీ 1,150, వేదాంతు 1,109, వైట్‌హ్యాట్‌ జూనియర్‌ 1,000 ఉద్యోగాల్లో కోత విధించినట్లు వెల్లడించింది.

మరోవైపు ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశీయ సంస్థలతోపాటు, అంతర్జాతీయ సంస్థలూ నూతన నియామకాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కొత్తతరం సాంకేతికతలైన కృత్రిమ మేథ, మెషీన్‌ లెర్నింగ్, వెబ్‌3, డేటాసైన్స్, అనలిటిక్స్‌లాంటి వాటికి మాత్రమే గిరాకీ పెరుగుతోందని చెబుతున్నారు. సంస్థలు తమకు అవసరమైన పనిని చేయగల ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.