Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్ గ్రాఫ్ ప‌డిపోయిందా?

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:33 AM GMT
బండి సంజ‌య్ గ్రాఫ్ ప‌డిపోయిందా?
X
తెలంగాణ‌లో బీజేపీ బ‌లంగా ఎదుగుతోంది.. బండి సంజ‌య్ నాయ‌క‌త్వంలో పార్టీ రాష్ట్రంలో ప‌రుగులు పెడుతోంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించే దిశ‌గా సాగుతోంది.. ఇవీ మొన్న‌టివ‌ర‌కూ వినిపించిన మాట‌లు. కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆ పార్టీలోని సీనియ‌ర్లకు సంజ‌య్ ప‌డ‌డం లేద‌నే వార్తలు వ‌స్తున్నాయి. దీంతో సంజ‌య్ గ్రాఫ్ ప‌డిపోయిందా? అనే ప్ర‌శ్న‌లు రేకెత్తుతున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన సంజ‌య్‌.. 2019 లోక్‌స‌భ్ ఎన్నిక‌ల్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా గెలిచారు. 2020లో అత‌నికి రాష్ట్ర అధ్య‌క్షుడిగా అధిష్టానం బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టింది. అప్ప‌టి నుంచి త‌న దూకుడుతో ఆయ‌న‌ పార్టీని ముందుకు న‌డిపిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పార్టీ మెరుగైన ఫ‌లితాలు సాధించ‌డంలో ఆయ‌న పాత్ర ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇక ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈటల రాజేంద‌ర్ విజ‌యానికి కూడా సంజయ్ తోడ్పాటు అందించార‌ని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా సంజ‌య్ నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కంతో ఢిల్లీకి పిలిపించి దిశానిర్దేశం చేసి పంపించింది. కానీ ఇటీవ‌ల ప‌రిస్థితులు ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ‌లో బీజేపీ ఆశ‌లు ఆవిరి అయిపోతున్నాయా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

బండి సంజ‌య్‌కు తెలంగాణ బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు మ‌ధ్య దూరం పెరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సొంత ప‌బ్లిసిటీ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితులు లేవ‌నే భావ‌న క‌లుగుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

జీహెచ్ఎంపీ ఎన్నిక‌ల‌ప్పుడు ఎన్నో మాట‌లు చెప్పిన సంజ‌య్‌.. ఆ త‌ర్వాత వాటిని ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. గ్రామాల్లో బండి సంజ‌య్ అంటే ఎవ‌రో కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌డం లేద‌ని టాక్. మ‌రోవైపు ఆయ‌న త‌న నిర్ణ‌యాల‌తో ముందుకు సాగ‌డం.. సీనియ‌ర్ల‌ను దూరం పెట్ట‌డం హాట్ టాపిక్‌గా మారింది. కొత్త‌వాళ్ల‌ను ఆయ‌న ప్రోత్స‌హిస్తున్నారు కానీ సీనియ‌ర్ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

గ‌తంలో ఓ సారి ఈ విషంయ‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా సంజ‌య్ వైఖ‌రిపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పార్టీలోని ఓ వ‌ర్గం ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పార్టీకి తెలంగాణ‌లో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, డీకే అరుణ‌, కె. ల‌క్ష్మ‌ణ్ లాంటి సీనియ‌ర్ నేత‌లున్నారు. కానీ సంజ‌య్ మాత్రం త‌న‌దైన శైలిలో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నార‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇది పార్టీకి ఏ మాత్రం మంచిది కాద‌నే అభిప్రాయ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితుల‌న్నీ చూస్తుంటే సంజ‌య్ దూకుడుకు క‌ళ్లెం ప‌డిన‌ట్లే క‌నిపిస్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.