Begin typing your search above and press return to search.
మైనారిటీలో మోడీ సర్కారు..28న అసలు పరీక్ష
By: Tupaki Desk | 24 May 2018 4:40 AM GMTకమళనాథులకు మరో షాకింగ్ లాంటి వార్త. కర్ణాటకలో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే బీజేపీ సరికొత్త సమస్యను ఎదుర్కొంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే సంపూర్ణ మెజారిటీ (282) సాధించిన బీజేపీ ప్రస్తుతం ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కర్ణాటకకు చెందిన ఆ పార్టీ సభ్యులు యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఇటీవల లోక్‌సభకు రాజీనామా చేయడంతో బీజేపీ బలం 271కి తగ్గిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు సీట్లను బీజేపీ కోల్పోగా, ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు మరణించడంతో ఆ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీంతో 543 మంది సభ్యులున్న లోక్‌సభలో కనీస మెజారిటీ అయిన 272 సీట్లకు బీజేపీ ఒక స్థానం దూరంలో ఉంది. యడ్యూరప్ప, శ్రీరాములు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో ఈ నెల 19న బలనిరూపణకు కొన్ని గంటల ముందు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించినట్టు లోక్‌సభ వెబ్ సైట్ వెల్లడించింది. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి 271 మంది సభ్యులుండగా, వారిలో బీహార్ కు చెందిన ఒక ఎంపీ కీర్తీ ఆజాద్ ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ రాష్ర్టానికే చెందిన మరో ఎంపీ శత్రుఘ్న సిన్హా నిత్యం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. యూపీకి చెందిన మహిళా ఎంపీ సావిత్రీ బాయి సైతం దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇలా పార్టీ ఎంపీలే కొందరు అసమ్మతి గళం వినిపించించడం కూడా బీజేపీ నేతలకు కొరుకుడుపడని అంశం.
ఇదిలాఉండగా... తాజా పరిస్థితితో సాంకేతింగా సమస్య ఎదురుకాకపోయినప్పటికీ స్వల్పకాలంలోనే ఇబ్బందులు ఖాయమని అంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం లోక్ సభలో బీజేపీ ఎంపీల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. అయితే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ మునుపటిలా హుకుం చెలాయించే పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. ఇక 18 మంది ఎంపీలున్న శివసేనతో మోడీ సర్కార్ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా విడిగా పోటీ చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. జమ్ముకశ్మీర్ లో బీజేపీ మిత్రపక్షమైన పీడీపీ తమ శ్రీనగర్ లోక్ సభ స్థానాన్ని ఇటీవలి ఉప ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కు కోల్పోయింది. దీంతో ఈనెల 28 నాలుగు లోక్ సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
ఉప ఎన్నికలు జరగబోయే నాలుగు నియోజకవర్గాల్లోనూ బీజేపీ గట్టి పోటీనెదుర్కొంటోంది. మరోవైపు ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ మూడింటిలో గెలుపొందినప్పటికీ ఐదు స్థానాల్లో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ తన స్థానాలను నిలబెట్టుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు బీజేపీకి పార్లమెంట్ లో బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే భాగస్వామ్య పక్షాల మద్దతు లేకపోయినా ప్రభుత్వం గట్టెక్కగలదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 538 మంది సభ్యులే (536 మంది ఎన్నికైన వారు - ఇద్దరు ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యులు) ఉన్న నేపథ్యంలో బల నిరూపణకు 269 మంది అవసరమని, ఆ సంఖ్య బీజేపీకి ఉన్నదని వారు వివరిస్తున్నారు. ఒకవేళ ఈ నెల 28న జరుగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే మాత్రం కష్టాలు తప్పకపోవచ్చునని స్సష్టం చేస్తున్నారు.